కేసీఆర్ గజ్వేల్‌కే ముఖ్యమంత్రా !

by  |
కేసీఆర్ గజ్వేల్‌కే ముఖ్యమంత్రా !
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన రైతులకు అన్యాయం చేస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులకు చాలా ఇబ్బందులు మిగిల్చుతుందన్నారు. ఆదివారం కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గుంట సర్వే చేసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు అయినా ఇంకా ప్రక్షాళన పూర్తి కాలేదన్నారు. రాష్ట్రంలో ఇంకా పన్నెండు లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని, పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోతే రైతులు పడే కష్టం ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వానికి తెలియనిదేమీ కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కరీంనగర్‌ సభలో సీఎం కేసీఆర్ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారని, అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని కోదండరెడ్డి ఆరోపించారు.

పట్టాదారు పాసు పుస్తకాల కోసం రైతులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఓ రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఏకంగా పెట్రోల్ పోసి తాసిల్దార్‌ని హత్య చేసిన సంఘటనను గుర్తు చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ గజ్వేల్ జిల్లా రైతులకు ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాలు పంపించాలని ఆదేశాలిచ్చారని, సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రా లేక రాష్ట్రానికా అని ప్రశ్నించారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని పదేపదే ప్రకటించి రైతులకు ఆశ పెట్టారని, రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని కోదండరెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఇదే అదనుగా భూకబ్జాలు చేస్తున్నారని, చివరకు చెరువుల శిఖం భూములను కూడా ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed