అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదు

by  |
అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదు
X

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఏమున్నప్పటికీ అంతిమంగా కేంద్ర న్యాయశాఖ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. ప్రత్యేకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనే సీట్ల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇదే విషయాన్ని కేంద్ర హోంసహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం ఏపీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి సంబంధించి చాలా విజ్ఞప్తులు వచ్చాయని, కానీ కొన్ని రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉన్నందునే సానుకూల నిర్ణయం సాధ్యం కాలేదని అన్నారు.

ఏపీ విభజన చట్టంలో చాలా అంశాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని, అలాంటివాటిలో ఇది కూడా ఒకటని ఆయన గుర్తుచేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన తీరులో అనేక అంశాలను పెట్టిందని అన్నారు. రాత్రికి రాత్రి ఈ అంశాన్ని చట్టంలో పెట్టిందని, దానివల్లనే ఇప్పుడు ఈ అంశం సంక్లిష్టంగా మారిందన్నారు. దేశమంతటా సీట్ల సంఖ్య పెంచడానికి విధానపరమైన నిర్ణయం జరిగినప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పెంపు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలోనూ అదే తీరులో జరిగిందని గుర్తుచేశారు. ఇకపైన కూడా అలాగే జరుగుతుందన్నారు. సీట్ల సంఖ్యను పెంచడంపై తుది నిర్ణయం తీసుకునేది కేంద్ర న్యాయమంత్రిత్వశాఖేనని అన్నారు. ఇప్పటికైతే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

జమ్ము కశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్యను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఇంకా ఆ రాష్ట్రంలో సీట్ల సంఖ్యను పెంచడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇంకా ఆ అంశం ఆలోచన దశలోనే ఉన్నదని, ప్రక్రియ ప్రారంభం కాలేదని కిషన్ రెడ్డి వివరించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed