కిసాన్ కాంగ్రెస్ నేత రాజీనామా.. నేరుగా సోనియాకు లేఖ

by  |
Kodandareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవి నుంచి సీనియర్ నేత కోదండ రెడ్డి తప్పుకున్నారు. ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్టీ సీనియర్ నేతలు రాహుల్‌గాంధీ సహా ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులకు కూడా ఈ కాపీని పంపినట్లు ఆయన ‘దిశ‘కు వివరించారు. రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమితులైనందున కొత్త కమిటీ కూర్పుకు అనుగుణంగా తాను ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక రాష్ట్ర కమిటీకి కొత్త నేత ఎంపికైనప్పుడు ఆయన పరిధిలో ఉండే కమిటీలన్నింటినీ పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించడానికి వీలుగా తనంతట తానుగా పూర్తి సహకారంతో ఈ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పార్టీ క్రమశిక్షణ, పద్ధతులకు లోబడే తాను ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నానని, కానీ కిసాన్ కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిధిలో ఉన్నందున దానితో రాష్ట్ర కమిటీకి సంబంధం లేదని వివరించారు. కొత్త పీసీసీ చీఫ్‌గా ఎవరు వచ్చినా వారి పరిధిలో ఉండే కమిటీలకు కొత్త కూర్పు ఉంటుందని, దానికి అనుగుణంగానే వెసులుబాటు కల్పించే ఉద్దేశ్యంతో తనంతట తానుగానే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంతకు మించి మరే సందేహాలకు ఆస్కారమే లేదని, ఈ నిర్ణయం తీసుకోడానికి ముందుగానే రేవంత్‌రెడ్డితో ఈ విషయాన్ని చర్చించినట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, వారం పది రోజుల పాటు వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత దాదాపు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయమేనని కోదండరెడ్డి వివరించారు.

Next Story

Most Viewed