సింగిల్ పెయింటింగ్‌.. మూడు యాంగిల్స్‌లో ముగ్గురు!

by  |
సింగిల్ పెయింటింగ్‌.. మూడు యాంగిల్స్‌లో ముగ్గురు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ పెయింటింగ్‌లో.. ముద్దులొలికే చిన్నారి ముద్దుగా కనిపిస్తూ మన కళ్లను ఆకర్షిస్తుంది. అదే పెయింటింగ్‌ను మరో కోణంలో చూస్తే.. చిట్టిపొట్టి చిన్నోడు దీనంగా చూస్తూ ఉంటాడు. మరో పెయింటింగ్‌లో.. ముడతల పడ్డ దేహంతో, ముగ్గుబుట్ట నెత్తిన పెట్టుకుని ఆరుపదుల వృద్ధ మహిళ.. అలా మన వంకే చూస్తూ ఉంటుంది. కొద్దిగా యాంగిల్ మార్చి చూస్తే, మెరిసే మేనితో అందమైన యువతి.. చూపు తిప్పుకోకుండా ఆకట్టుకుంటుంది. అలా చూస్తుండగానే ఓ సౌందర్యవతి.. మనకళ్లను కట్టిపడేస్తుంది. కాస్త పక్కకు వంగి చూశామో.. వెంటనే ఆమె ప్లేస్‌లో ఐన్‌స్టీన్ కనిపిస్తాడు. ఇదేదో.. కొత్తగా వచ్చిన ‘ఫేస్ యాప్’ మహిమో లేదా ‘పిక్స్ ఆర్ట్’ యాప్ సాంకేతికతో కాదు. తనకే సొంతమైన అద్భుత కళతో అందరినీ ఆకట్టుకుంటోన్న స్పానిష్ కళాకారుడు సెర్గి కా‌డ్నస్ ప్రతిభ.

ఫొటో ఫ్రేమ్ ఒకటే కానీ.. అందులో కనిపించే వ్యక్తి ఒక్కో యాంగిల్‌లో ఒక్కోలా మారిపోతాడు. అమ్మాయి అబ్బాయిగా, వృద్ధ మహిళ పదహారేళ్ల పడుచులా, ముసలి తాత ముగ్ధమనోహరమైన పాపలా మారిపోతారు. ఒకే పెయింటింగ్‌లో జీవితంలోని మూడు దశలను (యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్) చూపిస్తూ ఆర్ట్ వేయడం నిజంగా సెర్గికి మాత్రమే సాధ్యమా? అన్నట్లు తోస్తుంది. సెర్గి వేసే ఈ ఆర్ట్‌ను ‘కైనెటిక్ వాల్ ఆర్ట్’ అంటారు. స్పెయిన్‌లోని గిరోనాలో జన్మించిన సెర్గి.. సొంతంగానే ఈ ఆర్ట్‌ను నేర్చుకున్నాడు. తన కళను మెరుగుపర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. ముందుకు వెళ్లాడు. ఈ రోజు తన కళాఖండాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్యాలరీల్లో, ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తూ అభినందనలు అందుకుంటున్నాడు. మీరు కూడా సెర్గి క్యాడ్నస్ కళా ప్రదర్శనను చూడాలంటే.. తన ఇన్‌స్టా పేజీకి వెళితే సరి! అద్భుతమైన పెయింటింగ్స్ మీ మనసును దోచేయడం ఖాయం.

https://www.instagram.com/sergi.cadenas/?utm_source=ig_embed



Next Story

Most Viewed