జీతాలియ్యండి ప్లీజ్.. కేజీబీవీ సిబ్బంది ఆవేదన

by  |
KGBV
X

దిశ ప్రతినిధి, మెదక్: బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సమస్యలు తాండవిస్తున్నాయి. కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లకు గత కొన్ని నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో టీచర్లను ఆదుకుంటామని చెప్పిన సర్కారు ఇప్పటి వరకు వారి సమస్యలపై స్పందించలేదు. జీతాలు పేరోల్ చేయడంలో డీఈవోలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు డీఈవోను కలిసినా, స్టేట్ ఆఫీస్‌కు వెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇవేగాక మిగతా సమస్యలు సైతం కేజీబీవీల్లో తాండవిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 51 కేజీబీవీలు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు మండలానికొకటి చొప్పున 51 కేజీబీవీలు ఉన్నాయి. సిద్ధిపేట జిల్లాలో 22 కేజీబీవీలు, మెదక్‌లో 15 కేజీబీవీలు, సంగారెడ్డిలో 14 కేజీవీలు ఉన్నాయి. ఇందులో సిద్ధిపేట జిల్లావ్యాప్తంగా 22 ఎస్ఓలు, 148 సీఆర్టీ, 17 పీజీసీఆర్‌టీలు, 21 పీఈటీలు, 11 వీఓసీలు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు 17 మంది, మొత్తం 236 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 14 ఎస్ఓలు, 103 మంది సీఆర్టీ‌లు, 27 మంది పీజీసీఆర్‌టీలు, ఏడుగురు పీఈటీలు, 11 మంది వీఓసీలు, 12 మంది కంప్యూటర్ఇన్‌స్ట్రక్టర్లు, మొత్తం 174 మంది విధులు నిర్వర్తిస్తుండగా మెదక్ జిల్లాలో 16 కేజీబీవీలకు 15 మంది ఎస్ఓలు, 101 మంది సీఆర్టీలు, పీజీసీఆర్టీలు 12 మంది, పీఈటీలు 14 మంది, వీఓసీలు 13 మంది, 8 మంది కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, మొత్తం మెదక్ జిల్లాలో 163 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.

పేరోల్ చేయడంలో డీఈఓలు నిర్లక్ష్యం..

కరోనా లాక్‌డౌన్ ప్రారంభమైన నాటినుంచి 16 నెలలుగా తమకు జీతాలు రావం లేదని పలువురు కేజీబీవీలు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు లెక్చరర్లు ‘దిశ’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పేరోల్ చేయడంలో డీఈవోలు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ విషయమై పలుమార్లు డీఈవోను, స్టేట్ ఆఫీసులో కలిసినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. ప్రతి ఏడాది కేజీబీవీలో పనిచేసే వారిని రీ ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. కేజీబీవీలో పనిచేసే వారిని పే రోల్ అప్లోడ్ చేస్తే కలెక్టర్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారికి వేతనాలు అందుతాయి. ఈ విషయంలో సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలో గత రెండు నెలల క్రితం పేరోల్ ఆఫ్రూవ్ కాగా.. మెదక్ జిల్లాలో పేరోల్ ఆప్రూవ్ కాలేదు. పే రోల్ ఆప్రూవ్ అయినప్పటికీ సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలో గత మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. మెదక్ జిల్లాలో గత కరోనా లాక్‌డౌన్ సమయం నుండి సమస్య వేధిస్తూనే ఉంది. ఆ జిల్లాలో పనిచేస్తున్న వారికి 16 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేజీవీవీల్లో తాండవిస్తున్న సమస్యలు..

కేజీబీవీల్లో కేవలం జీతాల సమస్యే కాదు.. అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. కేజీబీవీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని పలు సందర్భాల్లో సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. కేజీబీవీ సమస్యల కోసం ప్రధానంగా యూటీఎస్ ఉపాధ్యాయ సంఘం వారి సమస్యలపై పొట్లాడుతోంది. కేజీబీవీల్లో ఉన్న ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, మిగతా టీచర్ల మాదిరిగా సెలవులివ్వాలని, వీక్లీ ఆప్, రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చాలా పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వాటిని ప్రభుత్వం గుర్తించి, భవనాలు నిర్మించాలని కోరారు. వీటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీతాలు సక్రమంగా చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని పలువురు కేజీబీవీలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించాలని కోరుతున్నారు.

కేజీబీవీల్లో సమస్యలు పరిష్కరించాలి : యాదగిరి, యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి

కరోనా సంక్షోభ సమయంలో కేజీబీవీ టీచర్లు, లెక్చరర్లు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరోల్ యాడ్ చేయడంలో మెదక్ జిల్లా ఆలస్యమైంది. వారి జీతాల సమస్యను త్వరగా పరిష్కరించి వేతనాలు అందించాలి. అదేవిధంగా కేజీబీవీల్లో చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి శ్రమకు తగ్గ వేతనాన్ని అందించాలి. హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. మిగతా టీచర్లతో పోలిస్తే కేజీబీవీలకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. కేజీబీవీలన్నీ టౌన్‌కు దూరంగా ఉన్నందున వారికి క్వార్టర్స్ నిర్మించాలి. కేజీబీవీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ యూటీఎఫ్ అండగా ఉంటుంది.

Next Story

Most Viewed