కేంద్రంపై తెలంగాణ వ్యూహాత్మక నిర్ణయం.. విద్యుత్ ఛార్జీలపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

by  |
Jagadish Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కంలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు, వసూలు చేస్తున్న ఛార్జీలే కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. గ్రీన్ (క్లీన్) ఎనర్జీ సెస్ పేరుతో వసూలు చేస్తున్నదంతా కేంద్ర ప్రభుత్వానికే చేరుతున్నదని, ఇప్పటివరకు తెలంగాణ డిస్కంలు సుమారు రూ. 7,200 కోట్లు నష్టపోయాయని మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఒక టన్ను బొగ్గుపై ఇంతకాలం ఉన్న రూ. 50 సెస్‌ను రూ. 400కు పెంచిందన్నారు. మరోవైపు బొగ్గు ధరను కూడా పెంచడంతో ఏటా సుమారు రూ. 725 కోట్ల మేర భారం పడుతున్నదన్నారు. విద్యుత్ వ్యవస్థపై సమీక్ష సందర్భంగా మంత్రులు పై వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో అప్పటికే ఉన్న ఒప్పందాలతో (పీపీఏ) లను ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణా డిస్కంలపై అదనంగా ఆర్థిక భారం పడిందన్నారు. ఈ లోటును పూడ్చుకోడానికి ఓపెన్ మార్కెట్ నుంచి ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనాల్సి వచ్చిందని, ఆ కారణంగా రూ. 2,763 కోట్ల భారాన్ని మోయాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి రావాల్సిన విద్యుత్‌ను అర్ధంతరంగా నిలిపేయడంతో తెలంగాణా డిస్కంలు రూ.2,502 కోట్లు అదనంగా భరించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం డిస్కంలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని ఆరోపించారు.

బొగ్గు రవాణా కోసం రైల్వే వ్యవస్థపై ఆధారపడక తప్పడంలేదని, కానీ ఫ్రైట్ ఛార్జీలను 40 శాతం మేర పెంచడంతో ఆ భారం కూడా రాష్ట్ర సంస్థలు భరించాల్సి వస్తున్నదన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిని కేంద్రం ఒకవైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నదన్నారు. రెన్యుబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ పాలసీని తప్పనిసరి చేయడంతో ఈ భారాన్ని మోయాల్సి వస్తున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికే రూ.12,185 కోట్ల నష్టాలతో ఉన్న డిస్కంలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మరింతగా కూరుకుపోతున్నాయన్నారు.

ఒక్కో వ్యవసాయ పంపుసెట్ కనెక్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.18,167 సబ్సిడీని చెల్లిస్తున్నదన్నారు. నెలకు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే ఇండ్లకు సబ్సిడీని ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయడం, దోబీఘాట్లు, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం, పవర్‌లూమ్ పరిశ్రమలతో పాటు కోళ్ల ఫారాలకు సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం.. ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు భారంగా మారాయన్నారు. ఈ రూపంలో గృహ వినియోగదారులకే ప్రతి ఏటా రూ.1253 కోట్ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీల రూపంలో అందిస్తున్న పథకాలకు తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు అదనంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు షాక్‌కు గురిచేస్తున్నాయన్నారు. కరోనా ప్రభావంతో రూ.4,374 కోట్ల మేర బిల్లుల వసూళ్లు నిలిచిపోవడం డిస్కమ్‌లపై అదనపు ఆర్థిక భారాన్ని తెచ్చిపెట్టిందన్నారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదనే తీరులో ఏఆర్ఆర్ సమర్పించిన డిస్కంలు టారిఫ్‌ను ప్రకటించడానికి ముందు మంత్రుల స్థాయిలో జరిగిన సమీక్షా సమావేశంలో సంస్థల ఆర్థిక నష్టాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story

Most Viewed