Kerala CM Pinarayi Vijayan : 11 రాష్ట్రాల సీఎంలకు కేరళ ముఖ్యమంత్రి లేఖ.. కీలక విషయాలు ప్రస్తావన

by  |
Kerala CM Pinarayi Vijayan
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రాలు ఐఖ్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్ 11 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారానే ‘హెర్డ్ ఇమ్యూనిటీ‘ (సామూహిక రోగ నిరోధక శక్తి) వస్తుందని శాస్త్రీయ అధ్యయనం తేల్చిందని గుర్తు చేశారు. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాలపైకి నెట్టి కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుందని, ఇలాంటి సమయంలో అన్ని రాష్ట్రాల ఒక్క మాటతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందంటూ ఆయన సీఎంలకు లేఖ రాశారు. అందులో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఉన్నారు.

కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సాన్ని చూస్తున్నామని, థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరికలు అందుతున్నా.. దానికి తగిన సన్నాహక చర్యలు పెద్దగా లేవని కేంద్ర ప్రభుత్వ విధానాన్ని పినరయి తప్పుపట్టారు. అన్ని రాష్ట్రాలూ ఒక్క మాటపై ఉండి దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు. రాష్ట్రాల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సొంతంగా టీకాలను సమకూర్చుకునేంత గొప్పగా లేవన్న విషయాన్ని నొక్కిచెప్పాలని కోరారు. సంపూర్ణ సహకార సమాఖ్య స్ఫూర్తి ఉండేలా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా కేంద్రం తన వంతు బాధ్యతను నిర్వర్తించేలా అన్ని రాష్ట్రాలూ ఐక్యంగా గళమెత్తాల్సిన అవసరాన్ని ఆ లేఖలో పినరయి ప్రస్తావించారు.

దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడానికి తగినంత ఉత్పత్తి లేదని కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టలేదన్నారు. ఇక్కడి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఉత్పత్తి చేసేలా తయారీ ఫార్ములా, విధానాన్ని కేంద్రం తన పరిధిలోకి తీసుకుని డిమాండ్‌కు తగిన ఉత్పత్తి జరిగేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని పినరయి వివరించారు. ప్రజల అవసరాలను, కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కేంద్రం దీన్ని తన బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 3.1 శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ రెండు డోసుల ఇవ్వగలిగామని, సామూహిక రోగ నిరోధక శక్తి రావాలంటే విశాల ప్రజానీకానికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా తొలి వేవ్ సమయంలో నియంత్రణను తన పరిధిలో ఉంచుకుని, ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న దశలో రాష్ట్రాలకు వదిలిపెట్టడం బాధ్యత నుంచి తప్పుకోవడంగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. సొంత నిధులతో వ్యాక్సిన్‌ను సమకూర్చుకోవడంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రమే తగిన సాయం చేసి ఉచితంగా అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి వివరించి ఆచరణ సాధ్యం చేయాలని, ఇందుకోసం అన్ని రాష్ట్రాలూ ఐక్యంగా గొంతెత్తడం తక్షణావసరమని ఆ లేఖలో 11 రాష్ట్రాల సీఎంలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed