రైతు చట్టాలను వ్యతిరేకించిన కేరళ అసెంబ్లీ

by  |
రైతు చట్టాలను వ్యతిరేకించిన కేరళ అసెంబ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు నవంబరు 26 నుంచి నిరసనలు చేపడుతున్నారు. దీంతో రైతులను దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చట్టాలను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌లో భాగంగా అనేక రాష్ట్రాలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. తాజాగా రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. అన్నదాతల న్యాయమైన కోర్కెలపై కేంద్రం దృష్టి సారించాలని, మూడు చట్టాలనూ ఉపసంహరించాలని ఈ తీర్మానంలో కోరారు. ఈ తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన సభలో దీన్ని ప్రవేశపెట్టిన సీఎం పినరయి విజయన్.. వ్యవసాయం పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో కేంద్రం పార్లమెంటులో మూడు చట్టాలను ఆమోదించిందని, వీటి ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఢిల్లీ నగరంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఆందోళన సాగుతోందని చెప్పారు. ఇప్పటివరకూ ఇంతటి నిరసనను చూడలేదన్నారు. ఇప్పటికే 32 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వెంటనే చట్టాలను ఉపసంహరించుకొని, రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Next Story