గవర్నర్ ఆదేశాలకు కేజ్రీవాల్ వ్యతిరేకం

by  |
గవర్నర్ ఆదేశాలకు కేజ్రీవాల్ వ్యతిరేకం
X

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జారీ చేసిన ఆదేశాలను అరవింద్ కేజ్రీవాల్ సర్కారు వ్యతిరేకించింది. కరోనా పాజిటివ్ తేలిన వారందరూ కచ్చితంగా ఐదురోజుల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్వారంటైన్‌లో ఉండాలని శుక్రవారం అనిల్ బైజాల్ ఆదేశించారు. స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నవారందరూ హాస్పిటళ్లలో క్వారంటైన్‌లో ఉండాలని, తద్వారా వారిని పటిష్టంగా పర్యవేక్షించడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు. అయితే, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(డీడీఎంఏ) హెడ్ అనిల్ బైజాల్ జారీ చేసిన ఆదేశాలపై సర్కారు అసంతృప్తి వ్యక్తం చేసింది.

గవర్నర్ ఆదేశాలు ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో విభేదిస్తున్నాయని, రాష్ట్రంలో గందరగోళం ఏర్పడవచ్చునని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలుండగా, ఢిల్లీకోసం ప్రత్యేకంగా రూల్స్ ఎందుకు అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత ఉన్నదని, పడకలు సరిపోవడంలేదనే కేంద్ర ప్రభుత్వం ఐసొలేషన్‌ల కోసం రైల్వే బోగీలను ఏర్పాటు చేస్తున్నదని, ఈ తరుణంలో హోం క్వారంటైన్‌లో ఉన్నవారినీ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని ఆదేశించడం సరికాదని ఆప్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. గవర్నర్ ఆదేశాలను అనుసరిస్తే జూన్ చివరికల్లా కనీసం 90వేల బెడ్‌లు అవసరమవుతాయని, కేజ్రీవాల్ ప్రభుత్వం 15వేల బెడ్‌లను మాత్రమే ఏర్పాటు చేయగలిగిందని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చాద్దా తెలిపారు. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌ను కలిసి కోరబోతున్నట్టు మనీష్ సిసోడియా చెప్పారు.

Next Story

Most Viewed