సాగర్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్, కేటీఆర్

by  |
సాగర్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్, కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. పార్టీ అధిష్టానం మండలానికో ఇన్చార్జిని, మున్సిపాలిటీలకు ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున నియమించింది. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలంతా ఆయా మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తున్నారు. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పరిష్కరిస్తున్నారు.

అయితే ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సాగర్ లో పర్యటించనున్నారు. ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందు పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకా వారు పర్యటించే తేదీలు ఖరారు కాలేదు. త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

ఫిబ్రవరి 10 నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్

సాగర్ ఉన్న ఎన్నికల తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని భావించిన సీఎం కేసీఆర్.. ఫిబ్రవరి 10వ తేదీన హాలియా సమీపంలోని 14వ మైలురాయి వద్ద ధన్యవాద సభ నిర్వహించారు. ఒకే రోజు నెల్లికల్ వద్ద ఎత్తిపోతల పథకంతో పాటు మొత్తం 13 లిప్టులకు పునాది రాయి వేశారు. రూ.600 కోట్లతో పెద్దదేవులపల్లికి గోదావరి నీళ్లు తీసుకొచ్చేందుకు లిప్టు ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా తోపుచర్ల, వీర్లపాలెం లిప్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. హాలియా డిగ్రీ కళాశాల నిర్మాణానికి భూమిపూజచేశారు. నియోజకవర్గ సమస్యలు తెలుసని, ఇప్పటికే చేసిన అభివృద్ధితో పాటు చేయబోయే అభివృద్ధి పనులను వివరించారు. తనదైన శైలీలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రజలను ఆకట్టుకున్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకే…

నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ క్రమక్రమంగా వారంతా టీఆర్ఎస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి పరాజయం పాలైన కుందూరు జానారెడ్డి.. తిరిగి ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. గత క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపకుండా మండలాల ఇన్చార్జులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో జానారెడ్డికి మరోసారి చెక్ పెట్టేందుకు అన్ని వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ముందస్తుగా పర్యటించారు. మరోసారి ప్రజల్లో, టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు చేస్తున్న అభివృద్ధిని మరోసారి వివరించేందుకు నియోజకవర్గంలో త్వరలోనే పర్యటిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అదే విధంగా బీజేపీలో రాష్ర్ట పదవిలో ఉంటూ టికెట్ ఆశించిన భంగపడిన బీసీ నేత కడారి అంజయ్య యాదవ్‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. బీజేపీకి సాగర్లో గెలిచే అవకాశాలు లేకుండా చేయడంలో సఫలీకృతులయ్యారని పలువురు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధిష్టానం ముందుకు సాగుతుంది.


Next Story

Most Viewed