రెమ్‌డెసివర్ అక్రమ విక్రయం.. ఇద్దరు అరెస్ట్

by  |
Remdesivir injections
X

దిశ, కరీంనగర్ సిటీ: కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న పోగుల తిరుపతి, పోగుల మనోహరను రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్ముతుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధిక డబ్బులకు ఆశపడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాంపౌండర్, ఫార్మసిస్టులుగా విధులు నిర్వహిస్తు్న్న సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అమాయక కరోనా బాధితుల నుంచి ఒక్కో రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు.

వీరి కదలికలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పక్కా ప్రణాళికతో అధిక ధరలకు ఇంజెక్షన్లను అమ్ముతున్న పోగుల తిరుపతి, పోగుల మనోహరను శనివారం పట్టణంలోని ఆదర్శనగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ మల్లయ్య, సృజన్ రెడ్డి, కరీంనగర్ త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్ పి.దామోదర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏఆర్ఎస్ఐ నర్సయ్య, టాస్క్ ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులను సీపీ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు.

Next Story

Most Viewed