అత్యద్భుతంగా.. కమలా హ్యారీస్ గ్లాస్ పొట్రెయిట్

by  |
అత్యద్భుతంగా.. కమలా హ్యారీస్ గ్లాస్ పొట్రెయిట్
X

దిశ, ఫీచర్స్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగానే కాకుండా ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్య చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడంతో, ఆమె గౌరవార్థం ఒక ప్రత్యేకమైన గాజు చిత్రాన్ని చారిత్రాత్మక లింకన్ మెమోరియల్ ముందు ఆవిష్కరించారు.

కమలా హ్యారిస్ విజయం యావత్ మహిళల విజయం కాగా, ఇంక్రెడిబుల్ లీడర్‌గా కమల ఎదిగిన వైనం అందరికీ స్ఫూర్తిదాయకం. అగ్రరాజ్యంలో ఇదో కొత్త చరిత్ర కాగా, ఆమె విజయం చిరస్మరణీయమైనది కావడంతో ఆమె గాజు చిత్రాన్ని ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు లింకన్ మెమోరియల్ ముందు క్రియేటివ్ ఏజెన్సీ బీబీహెచ్ న్యూయార్క్ ఆధ్వర్యంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రత్యేకమైన కళాకృతులను సృష్టించడానికి లామినేటెడ్ సేఫ్టీ గ్లాస్‌ను బ్రేక్ చేసి, దాన్నుంచి ఏర్పడిన గాజు ముక్కలతో కళాకారుడు సైమన్ బెర్గెర్.. ఆమె గాజు చిత్రాన్ని రూపొందించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుండగా, ముక్కలైన అగ్రరాజ్యాన్ని ‘కమల’ నాయకత్వం ఏకం చేస్తుందని, రాజకీయ మార్పును తనతో పాటు అందరూ కోరుకున్నారని, ఈ విషయంలో అందరం విజయం సాధించామని ఆర్టిస్ట్ సైమన్ బెర్గర్ అన్నారు. ఆ యూనిక్ గ్లాస్ పోట్రెయిట్ మీద ఓ క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేశారు. సందర్శకులు ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ స్పార్క్ అగ్మెంటెడ్ రియాలిటీలో వీక్షించవచ్చు.

‘నేటి మహిళా పురోగతికి అంతకుముందు మార్గదర్శకంగా నిలిచిన మహిళలు కారణం కాగా, కమల వంటి ట్రైల్ బ్లేజర్స్, వారి గొంతు నలుదిక్కులా వినిపించారు. హక్కుల కోసం కవాతు చేశారు, అన్నిటికీ మించి ఎన్నికల్లో పోటీ పడ్డారు. కమల గాజు పైకప్పులను పగులగొట్టగా.. ఇతర మహిళలు వాటిని ముక్కలు చేసి, మరో కొత్త దారివేస్తారు. ఈ కళాకృతి కమల విజయం మాత్రమే కాదు, ఆమె ముందు వచ్చిన మహిళలను, ఆ తరువాత వచ్చే వారినీ గుర్తిస్తుంది’ అని నేషనల్ ఉమెన్స్ హిస్టరీ మ్యూజియం అధ్యక్షులు, సీఈవో హోలీ హాచ్నర్ అన్నారు.



Next Story

Most Viewed