‘వోగ్’పై నెటిజన్ల ఫైర్

by  |
‘వోగ్’పై నెటిజన్ల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్య చరిత్రలో తొలి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గా, ఈ పదవిని అధిరోహించిన తొలి నల్లజాతీయురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించగా, ఆమె చారిత్రాత్మక విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా మహిళలు సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. పురుషాధిపత్య రంగంలో ఆమె విజయం ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్’కు సంకేతంగా భావించగా, భారత సంతతి వ్యక్తి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమెపై అభినందనలు వెల్లువెత్తాయి. కాగా ఆమె ల్యాండ్‌మార్క్ విక్టరీకి గుర్తుగా.. వోగ్‌ తన ఫిబ్రవరి సంచికను కమలా హారిస్‌ కవర్‌ ఫొటోతో తీసుకొస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా, కవర్ పేజీపై కమలా హారిస్ రంగును మార్చడం వివాదాస్పదంగా మారింది. దీంతో వోగ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కొవిడ్ మహమ్మారికి కూడా వ్యాక్సిన్ రాబోతుంది. కానీ ‘రేసిజం’ జాఢ్యానికి మాత్రం ఎప్పటికీ మందు వచ్చేట్లు లేదు. ట్రంప్‌ అధ్యక్ష కాలంలో ముదిరిన జాత్యాంహకార ఆందోళనలు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పటికీ ఏదో ఒక దేశంలో జాత్యాహంకార ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా భారత్ -ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిడ్నీ టెస్ట్‌లో సిరాజ్‌, బుమ్రాతో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ జాత్యాహంకార కామెంట్స్‌ చేయగా సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ విషయంలోనూ వోగ్ ఇదే పునరావృతం చేస్తోంది. ‘బై ద పీపుల్, ఫర్ ది పీపుల్ – ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫ్యాషన్’ అనే ట్యాగ్ ‌లైన్‌తో ‘మేడమ్ వైస్ ప్రెసిడెంట్! కమలా హారిస్ అండ్ ద న్యూ అమెరికా’ అనే పేరుతో వోగ్ ఫిబ్రవరి సంచికను ముద్రించింది. నిజం చెప్పాలంటే..

కవర్ పేజీ కోసం వోగ్ ఇలాంటి ఫొటోలను ఎంచుకోదు. ఇది వోగ్ శైలే కాదు. ఒక్కసారి ఆ ఫొటో గమనిస్తే.. ‘కమల స్నీకర్స్ వేసుకోవడం, ఆమె అసౌకర్యమైన నవ్వు, అన్నింటికంటే ముఖ్యంగా ఫొటో చాలా అస్పష్టంగా ఉండటంతో పాటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళను రిప్రజెంట్ చేసే ఔట్‌ఫిట్స్ విషయంలోనూ వోగ్ విఫలమైంది’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణాలను పరిగణలోకి తీసుకోకపోయినా.. వోగ్ చేసిన మరో తప్పిదం ఆమె స్కిన్ టోన్ మార్చడం. లైటింగ్, ఎడిటింగ్ ఏదైనా కారణం కావచ్చు, కానీ శ్వేతజాతీయేతర మహిళ రంగును మార్చడం నిజంగా ‘జాత్యాహంకార’ ధోరణికి అద్దం పడుతోందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘అసలు ఆమె రంగును మార్చడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి. అసలేం చెప్పదలచుకున్నారు? ఇదే మేల్ వైస్ ప్రెసిడెంట్ అయితే వోగ్ కవర్ పేజ్ ఇలానే ఉండేదా? తప్పకుండా భిన్నంగా ఉండేది! ఒక ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తిని జీన్స్, టెన్నిస్ షూస్‌లో ఒక ప్రధాన పత్రిక ముఖచిత్రంగా ఎన్నుకోదు. ఆమెకు గౌరవం ఇవ్వండి’ అని కామెంట్లు చేస్తున్నారు. వోగ్ ఏ ఉద్దేశంతో ఆమె రంగును మార్చినా, ఇది మరో జాత్యాహంకార నిరసనకు దారి తీసే అవకాశం లేకపోలేదు. మరి వోగ్ దీనిపై ఏ విధంగా స్పందించి, యావత్ శ్వేతజాతీయేతరులను శాంతిపరుస్తుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed