గాంధీజీ సాక్షిగా జర్నలిస్టుల నిరసన.. కళ్లకు గంతలు కట్టుకొని మరీ

by  |
గాంధీజీ సాక్షిగా జర్నలిస్టుల నిరసన.. కళ్లకు గంతలు కట్టుకొని మరీ
X

దిశ, నర్సంపేట: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సమాజహితం కోసం రేయనకా, పగలనకా శ్రమిస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తోంది. ఏళ్లుగా జర్నలిస్టులకు ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవట్లేదు. గాంధీ జయంతి నేపథ్యంలో బాపూజీ సాక్షిగా జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను నర్సంపేట డివిజన్ లో పాత్రికేయ మిత్రులు ఎండగట్టారు. వివరాలలోకి వెళితే.. నర్సంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డివిజన్ లోని జర్నలిస్టులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి స్వామి, బాపూజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

పని చేసే ప్రతి జర్నలిస్ట్ కు డబుల్ బెడ్ రూమ్ తో పాటు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ రెండు సంవత్సరాల పాటు నెలకు రూ. 2000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు వరాల జల్లు కురిపించడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. హామీలతోనే కాలం గడుపుతున్నారే తప్ప న్యాయం జరగట్లేదని, ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ నర్సంపేట డివిజన్ ఇన్ ఛార్జి నాంపల్లి మురళీధర్ మట్లాడుతూ.. సంస్థ మారినా పాత్రికేయుల పట్ల అక్రిడిటేషన్ పొడిగింపు విషయంలో సంబంధిత సంస్థలు వివక్ష చూపడం సరికాదన్నారు. జర్నలిస్ట్ ఎక్కడున్నా జర్నలిస్టే అని, వారిని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్ట్ ల సమస్యలు తీర్చాలన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీల మేరకు డబుల్ బెడ్ రూమ్స్, మెడికల్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదాటి గోపాల కృష్ణ, గట్ల అమరెందర్, మహాదేవుని జగదీష్, తాళ్ల సురేందర్ రెడ్డి, మేర్గు మోహన్, గాండ్ల ప్రదీప్, వడ్ల కొండ పవిత్రన్, రాజు, ప్రశాంత్, శశిధర రెడ్డి, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed