రాజన్న సేవలో ప్రధాని మోదీ

by Disha Web Desk 23 |
రాజన్న సేవలో ప్రధాని మోదీ
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. ఆలయ చరిత్రలో రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా మోడీ నూతన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 9:30 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుండి నేరుగా బాల నగర్ వద్ద ఏర్పాటు చేసిన జన సభలో పాల్గొన్న మోడీ సుమారు 45 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన హిందీ ప్రసంగాన్ని బీజేపీ సీనియర్ నాయకులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలుగులోకి అనువాదించారు.

సభపైనుంచి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని చూసి జనం బాగోద్వేగంతో మోడీ మోడీ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఇదిలా ఉండగా ఈ సభకు పెద్దఎత్తున తరలి వచ్చిన అశేష జనవాహినిని చూసిన మోడీ ఉప్పొంగిపోయారు. ఇంత ఉదయం 10గంటల సమయంలో తాను తన గుజరాత్ లోను ఇంత మందిని చూడలేదని, ఇంతమంది తనకు మద్దతుగా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దక్షిణ కాశీ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ తో పాటు మిగతా అభ్యర్థులను ఎంపిలుగా గెలిపించాలని, మీరు తెలంగాణ నుంచి వీరిని గెలిపించి నాకు మద్దత్తుగా పంపిస్తే, తాను ప్రధానిగా రాష్ట్రానికి ఏమి చేయాలో అది చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రసంగిస్తున్న సమయంలో మద్యమద్యలో మోడీ,మోడీ, జై శ్రీరామ్ అంటూ గట్టిగా నినాదించారు.














ఇదిలా ఉండగా బండి సంజయ్ పేరు ఎత్తినప్పుడల్లా సభకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఈలలు, కేకలతో కేరింతలు కొట్టడం విశేషంగా మారింది. మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు ప్రధాని తన మాతృమూర్తి తో మాట్లాడుతున్న చిత్రం, బాల రాముడికి మొక్కుతున్న మోడీ చిత్రం, అభ్కి బార్ 400 పర్ అంటూ ప్రదర్శించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సభలో ఆయన వెంట కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులు బండి సంజయ్, నగేష్, శ్రీనివాస్ లతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు వికాస్ రావు, ఎర్రం మహేష్, అల్లాడి రమేష్ తదితరులు ఉన్నారు.

ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు

సభ ముగిసిన అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సరిగా అదే సమయంలో ఎండ తీవ్రత పెరగడంతో సభకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభ స్థలం నుండి తిప్పాపూర్ వరకు సుమారు గంటన్నర పాటు వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది.

Next Story