బీసీలను పట్టించుకోక పోవడం అన్యాయం : జాజుల శ్రీనివాస్ గౌడ్

by  |
బీసీలను పట్టించుకోక పోవడం అన్యాయం : జాజుల శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మునుగోడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జెండాలు మోసి జైలు జీవితం అనుభవించి సర్వం కోల్పోయింది బడుగు బలహీన వర్గాల ప్రజలేనని అన్నారు. వారికి ఎందుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోని నాయిని బ్రాహ్మణులకు, పద్మశాలీలకు, శాలివాహన వర్గాల ప్రజలకు అవకాశం ఇవ్వకుండా వారికి మొండిచేయి చూపి అగ్రకుల సామాజికానికి చెందిన కలెక్టర్ ను రాజీనామా చేయించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

జనాభా దామాషా ప్రకారం 12 ఎమ్మెల్సీలకు గాను ఆరు ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎంపీటీసీలు, జడ్పిటిసిలకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని కేసీఆర్ కూతురు కవితనే నేరుగా తెలిపారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి శాసనమండలి ఎన్నికల్లో సర్పంచులకు, జడ్పిటిసిలకు ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటోజువెంకటాచారి, బీసీ సంఘం నాయకులు ఈదులకంటి కైలాష్ గౌడ్, భీమగోని ముత్యాలు గౌడ్, పాలకూరి కిరణ్, ముప్పవరం ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed