పవర్ బిల్లు ఫికర్ వద్దు

by  |
పవర్ బిల్లు ఫికర్ వద్దు
X

– ఎక్కువ కడితే తిరిగిస్తాం
– విద్యుత్ శాఖపై మంత్రి జగదీష్‌రెడ్డి రివ్యూ

దిశ,న్యూస్‌బ్యూరో: ఈ నెల విద్యుత్ బిల్లు ఒకవేళ ఎక్కువగా కట్టాల్సి వస్తే వచ్చే నెల బిల్లులో సర్దుబాటు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసే అవకాశం లేకపోవడంతో ఈఆర్సీ ఆదేశాల ప్రకారం గతేడాది మార్చి బిల్లు చెల్లించమంటున్నామని చెప్పారు. నిజానికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బిల్లులు 10 నుంచి 15 శాతం ఎక్కువగా వస్తాయని, తాము మాత్రం గతేడాది ఎంతో అంతే కట్టమంటున్నామన్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం, బిల్లులు తదితర అంశాలపై జగదీష్ రెడ్డి హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ భవన్‌లో సోమవారం సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాలు సైతం గతేడాది బిల్లులు చెల్లించే విధానాన్నే అమలు చేస్తున్నాయని తెలిపారు. కస్టమర్లకు బిల్లులు పంపామని, వాటిని ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. ఇప్పటికే టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 40శాతం మంది ఆన్‌లైన్‌లోనే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. ఈ నెలలో ఎస్పీడీసీఎల్‌కు రూ.620 కోట్లు, ఎన్పీడీసీఎల్‌కు రూ.203 కోట్లు విద్యుత్ బిల్లులు వసూలు కావల్సి ఉందన్నారు. కమర్షియల్ కేటగిరీ కస్టమర్లు గతేడాది మార్చి బిల్లులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. గత మార్చిలో 8900 మెగావాట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది అది 7800 మెగావాట్లకు పడిపోయిందని చెప్పారు. లాక్‌డౌన్ లేకపోతే 13,500 డిమాండ్ ఉంటుందని అంచనా వేశామన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు పడ్డా ఎక్కడా చిన్న ట్రాన్స్ ఫార్మర్‌కు ఇబ్బంది రాకుండా చూసామన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నందున విద్యుత్ సిబ్బంది నిరంతరం శ్రమించి 24 గంటల విద్యుత్ సప్లై చేస్తున్నారని కొనియాడారు. విద్యుత్ ఉద్యోగులు వైద్య సిబ్బంది లాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కాగా, అంతకముందు విద్యుత్ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్‌కో ఎండీ డి. ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి పాల్గొన్నారు.

tags: telangana, power bills, lockdown, jagadeesh reddy, review



Next Story

Most Viewed