ధరణిలో ‘ఆస్తి’

by  |
ధరణిలో ‘ఆస్తి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: నెల రోజులుగా రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ చుట్టూ చర్చ జరుగుతోంది. రాజకీయ పరిణామాలు కూడా దానిపైనే నడుస్తున్నాయి. మొన్నటి దాకా సాగు భూముల పంచాయతీ నడిచింది. ఇప్పుడేమో సీఎం కేసీఆర్ వ్యవసాయేతర భూములనూ కంప్యూటరీకరించాలన్న సంకల్పంతో ఉన్నారు. సాగు భూములకు హక్కులను నిర్ధారించడానికి సర్వే సెటిల్మెంట్ రికార్డులు, మ్యూటేషన్ల రికార్డులతో రూపొందించిన ఆర్వోఆర్ రికార్డు 1-బి వంటివి ఉన్నాయి. భూములు చేతులు మారినప్పుడల్లా తయారయ్యే రికార్డులన్నీ రెవెన్యూ కార్యాలయాల్లో ఉంటాయి. సాగు భూములకు వందేండ్ల రికార్డు కూడా దొరుకుతుంది. వాటి ఆధారంగా రూపొందించిన ‘ధరణి’ పోర్టల్ పైనే అనేక సందేహాలు, పలు చిక్కుముళ్లు చర్చనీయాంశంగా మారాయి.

భూమి హక్కుదారులకు గ్యారంటీ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడేమో వ్యవసాయేతర భూములనూ అదే పోర్టల్‌లో నమోదు చేస్తామని ప్రకటించారు. ఏ ప్రాతిపదికన చేస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటన ఆధారంగా కేవలం పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే ప్రాపర్టీస్‌ను నమోదు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడేమో పెద్ద చిక్కులేం రాకపోవచ్చు. భాగ పంపకాలు, మ్యూటేషన్లు చేయించుకోని ప్రాపర్టీస్ పై మాత్రమే పేచీ ఉండే అవకాశం ఉంది.

అలాంటి వారి ఆస్తుల నమోదులో పాత యజమానుల పేర్లే ‘ధరణి’కి ఎక్కే అవకాశం ఉంది. కానీ ఓపెన్ ప్లాట్లు, నాలా కన్వర్షన్ కట్టకుండానే చేసిన లేఅవుట్ల యజమానులకు చిక్కులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ ప్లాట్ల వివరాలేవీ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో లేవు. వాటిని ‘ధరణి’ పోర్టల్ లో ఏ ప్రాతిపదికన తీసుకుంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆబాది భూముల్లో ఏనాడూ ప్రభుత్వం సర్వే చేపట్టలేదు. ప్రభుత్వ భూములుగా పరిగణించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేవలం 15 రోజుల్లోనే వివరాలను కంప్యూటీకరించడం కంటే సమగ్రత లోపించకుండా చేయడం శ్రేయస్కరమని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొ.భూమి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాగైతే పార్టు బి అంశంగా వివాదాలు మారాయో, ఇప్పుడూ అదే జరగనుంది. ఐతే పార్టు బి వంటి ఆస్తి హక్కుల వివాదాల సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా.

వ్యవసాయేతర భూములకు ఆధారమేది?

కేవలం ఇంటి పన్నులు చెల్లించే ఆధారంతోనే వ్యవసాయేతర భూములను ‘ధరణి’ పోర్టల్ లో నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో ఏండ్ల క్రితం కట్టిన ఇండ్లకు కార్యాలయాల్లో రికార్డులు ఉంటాయి. కానీ ఓపెన్ ప్లాట్లను ఏ ఆధారంతో నమోదు చేస్తారన్న సందేహం కలుగుతోంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వివరాలేవీ ఇప్పటి దాకా ఎక్కడా నమోదు కాలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో సరికొత్త పాలన అందించబోతున్నారు. అయితే కేవలం 15 రోజుల్లోనే దీన్ని పూర్తి చేయాలంటూ పంచాయతీ రాజ్, మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఇక నుంచి అన్ని పనులు బంద్ చేసి ఈ ప్రక్రియను నిర్వహించాలని మొన్నటి ప్రగతి భవన్ సమావేశంలో సూచించారు. ఒక పోర్టల్ లోని డేటాను మరో పోర్టల్ కు మార్చే ప్రక్రియను చేపట్టనున్నారు.

దీని వల్ల తలెత్తే సమస్యలను గుర్తించేందుకు అధికారులు కూడా సిద్ధంగా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం సబ్ రిజిస్ట్రార్ దగ్గర మాత్రమే ఓపెన్ ప్లాట్ల యాజమాన్యపు వివరాలు ఉంటాయి. అది కూడా హక్కులకు గ్యారంటీ మాత్రం ఇవ్వలేరు. కేవలం సేల్ డీడ్ కు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ సాక్షి.. కానీ వాటి హక్కులకు మాత్రం కాదు. కొనుగోలు, అమ్మకందార్ల మధ్య ఒప్పందం మాత్రమే. అందుకే ఒకే భూమిని ఎన్నిసార్లు లేఅవుట్ చేసినా ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారు. ఎన్నిసార్లు లేఅవుట్లను మార్చినా గుర్తించే వ్యవస్థేదీ రిజిస్ట్రేషన్ల శాఖలో లేదు. అందుకే హైదరాబాద్ నగర శివార్లలో అనేక భూములకు హక్కుదార్లు ఇద్దరు, ముగ్గురేసి ఉన్నారు. నిజమైన హక్కుదార్లను గుర్తించే మెకానిజమేదీ ఇప్పటి దాకా అందుబాటులోకి రాలేదు. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుక్కొని తమ దగ్గర సేల్ డీడ్ ఉందంటూ అటు వైపు కూడా చూడని వాళ్లు వేలల్లో ఉన్నారు. అబ్సెంటీస్ పట్టాదార్లుగా ప్లాట్ల యాజమానులు కూడా ఉన్నారు. దాంతో వారి ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా గుర్తించని వైచిత్రం నగరాల చుట్టూ కనిపిస్తోంది.

డబుల్ లేఅవుట్లలో హక్కులెట్లా?

* రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఒక్కటే భూమిని రెండు, మూడేసి సార్లు లేఅవుట్ చేసి విక్రయించిన ఉదంతాలు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేయకపోయినా ఆ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో లక్షలాది సేల్ డీడ్లు హక్కుదార్ల దగ్గర ఉన్నాయి.
* సేల్ డీడ్ ఆధారంగా ‘ధరణి’లో నమోదు చేసేటట్లయితే ఎవరికి హక్కులు కల్పిస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు.
* హెచ్ఎండీఏ లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లోని సర్వే నంబర్లలోనూ అంతకు ముందే పంచాయతీ లేఅవుట్లుగా విక్రయించిన ఉదంతాలు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రధానంగా ఘట్ కేసర్, కీసర, మేడ్చల్, మూడుచింతలపల్లి, బోడుప్పల్, ఉప్పల్, జవహర్ నగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ తదితర మండలాల్లో ఉన్నాయి. సేల్ డీడ్ కాపీలు పట్టుకొని ఇది మా ప్లాట్లు అంటూ చెప్పుకుంటున్న వారు వేలల్లో ఉన్నాయి.
* ప్రతాపసింగారంలో ఓ 25 ఎకరాల్లో లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయించారు. కొందరు మాత్రం ఇండ్లు కట్టారు. అయితే నాలా కన్వర్షన్ కాకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ల పేర్లే వస్తున్నాయి. వాటిని యథాతథంగా ధరణిలో నమోదు చేశారు. దాంతో వారికి రైతుబంధు పథకం కింద రూ.లక్షలు వస్తున్నాయి. సదరు ప్లాట్ల యజమానులు వారి దగ్గరున్న సేల్ డీడ్లతో రెవెన్యూ అధికారులను సంప్రదించినా పట్టించుకోవడం లేదు. వందలాది మంది మధ్య తరగతి వర్గాలు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడెవరికి హక్కులు కల్పిస్తారోనన్న ఆందోళన ఆ ప్లాట్ల యజమానుల్లో వ్యక్తమవుతోంది.

స్వమిత్వతో మ్యాపింగ్

కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయేతర ఆస్తులకు స్వమిత్వ(సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) ప్రాజెక్టు కింద మ్యాపింగ్ చేసే ప్రక్రియను చేపట్టింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర పంచాయత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే చేస్తోంది. ఈ ఏడాది హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగతా రాష్ట్రాల్లోనూ నిర్వహించనున్నారు. దీని లక్ష్యం గ్రామీణ భారతంలో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం కల్పించడమే. ప్రతి ల్యాండ్ పార్శిల్ కు డ్రోన్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్(సీఓఆర్ఎస్) విధానాలతో మ్యాపింగ్ చేస్తారు. 2020 నుంచి 2024 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఈ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. స్వమిత్వ వల్ల రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరు పాళ్లు సమర్థవంతంగా చేపట్టొచ్చు. హక్కుదారులకు హక్కులకు గ్యారంటీ దక్కుతుంది. మ్యాపులతో గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్(జీపీడీపీ) ను పక్కాగా అమలు చేయొచ్చు. కానీ తెలంగాణలో మాత్రం కేవలం డేటాను 15 రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనుకుంటోంది.

వివాదాల పరిష్కారానికి వేదిక కావాలి : ప్రొ.సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ

ప్రభుత్వం పెద్దగా వివాదాలు లేవనుకుంటున్నది. కానీ భూ రికార్డుల ప్రక్షాళనలో ఎన్ని పార్టు బి కింద పెండింగులో ఉన్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ధరణిలో నమోదు చేసేది డేటా మాత్రమే. హక్కులు కల్పించడం కాదు. నమోదు చేయనంత మాత్రాన హక్కులు ఎక్కడికీ పోవు. కాకపోతే అమ్మడం, దానం చేయడం కుదరకుండా పోతుంది. ప్రభుత్వం వాటికీ టైటిల్ గ్యారంటీ ఏం ఇవ్వడం లేదు. అయితే వ్యవసాయేతర భూముల్లో అనేక వివాదాలు ఉన్నాయి. 15 రోజుల్లో నమోదు చేయడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేటట్లుగా మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా శాశ్వత ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. ప్లాట్ల యజమానులు, ఇతర హక్కుల యజమానులైనా ఏడాదొక్కసారైనా వారి హక్కులను పరిశీలించుకోవాలి.

Next Story

Most Viewed