లీడర్లూ ‘ధరణి’ బాధితులే.. హైకోర్టును ఆశ్రయించిన మంత్రి

by  |
లీడర్లూ ‘ధరణి’ బాధితులే.. హైకోర్టును ఆశ్రయించిన మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏడాది కాలంగా రాష్ట్రంలోని ప్రతీ ఊర్లో భూ పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రామంలో సుమారు 10 శాతం నుంచి 30 శాతం మంది పట్టాదారులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ధరణి సమస్యల పరిష్కారం కోసం మంత్రి హరీశ్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఈ కమిటీ సభ్యులందరికీ తెలుసు. కొందరు మంత్రులు కొనుగోలు చేసిన భూములు సైతం వివాదంలో చిక్కుకున్నాయి.

ఇక చివరకు తాను కొనుగోలు చేసిన భూమికి హక్కులు కల్పించని అధికారుల తీరును సవాల్ చేస్తూ ఓ మంత్రి హైకోర్టుకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే. ఏడాదిగా నిషేధిత జాబితాలో ఉన్న భూములపై 98,049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను ‘డిస్పోజ్’ చేసినట్టు అధికారులు ప్రకటించారు. రికార్డులను పరిశీలించకుండానే 90 శాతానికి పైగా దరఖాస్తులను తిరస్కరించారని సమాచారం. డిస్పోజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో సబ్ కమిటీకి డేటాను సమర్పించిన అధికారులు ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. ఇక సబ్ కమిటీ ఇప్పట్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా కనిపించడం లేదు.

అప్పుడు చేయాల్సినవి ఇప్పుడు..

రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సక్సెస్​అయిందని, అందుకే ఏడాదిలో 10 లక్షల లావాదేవీలు జరిగాయంటూ అధికారులు ప్రకటించారు. కార్డ్​విధానం కంటే ఎంత ఎక్కువగా క్రయ విక్రయాలు నిర్వహించారో మాత్రం చెప్పలేదు. ధరణి అమలైన ఏడాది తర్వాత అవగాహన కార్యక్రమాలు, హెల్ప్ డెస్కుల మాటలు మంత్రుల నోట నుంచి రావడం విడ్డూరంగా ఉంది. ధరణి పోర్టల్ అమలుకు ముందు చేపట్టాల్సిన పనులను ఇప్పుడు ప్రారంభిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక సబ్ కమిటీ నివేదిక రూపొందించి ఎప్పటికి సీఎంకు సమర్పిస్తుందోననే ప్రశ్న బాధిత రైతుల నుంచి వ్యక్తమవుతోంది. సబ్ కమిటీ సభ్యులు బాధిత రైతులతో సమావేశమైతే ధరణిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం తెలుస్తుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

వక్ఫ్​భూముల పంచాయితీ..

ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదు చేశారని ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా తమకు సంక్రమించిన భూములను తాజాగా వక్ఫ్​అంటూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించి ధరణి పోర్టల్​మాడ్యూళ్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఏకపక్షంగా తిరస్కరిస్తున్నారు. సమస్య పరిష్కారం కావాలంటే వక్ఫ్​బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకురావాలని అధికారులు బదులిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసిన ఉదంతాలు అనేకం. 60 ఏండ్ల రికార్డుల్లో అవి పట్టా భూములుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అవి సర్కారుకు చెందినవేనంటూ తహశీల్దార్లు నివేదికలు సమర్పిస్తుండడంతో కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

సేత్వార్‌లో ఏది ఉంటే అదే ఫైనల్​అంటూ తెగేసి చెబుతున్నారు. రికార్డుల ప్రకారం జరిగిన క్రయ విక్రయాలు, లావాదేవీలు, సెటిల్మెంట్​చేసిన భూములనూ పరిగణనలోకి తీసుకోకుండా డేటాను అప్‌లోడ్​చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఓ సర్వే నంబరులో ప్రభుత్వం పాక్షికంగా భూమి సేకరించినా ఆ మొత్తం విస్తీర్ణం ప్రభుత్వానిదేనంటూ ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. ఆఖరుకు అసైన్డ్​పట్టాలు పొందిన వారికి సైతం పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయకుండా అవి అటవీ భూములంటూ కొత్త పేచీ పెడుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా నమోదు చేసిన అధికారులు వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.

రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ భూములు వివాదాస్పదంగా మారాయి. పీఓబీ నుంచి తమ భూములను తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులను తిరస్కరించింది సైతం ఈ జిల్లాలోనే ఎక్కువని సమాచారం. ఒక సర్వే నంబరులోని కొంత భూమి నిషేధిత జాబితాలో ఉంటే ఆ సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణాన్ని బ్లాక్​చేశారు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి రికార్డులన్నీ వెరిఫై చేసిన తర్వాత భూమిని కొనుగోలు చేశారు. కానీ ధరణి పోర్టల్‌లో సదరు భూమిని పీఓబీ కింద చేర్చారు. ఇప్పుడు ఆయన ఈడీ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకురావాలి.

అయితే సామాన్యులకు ఎన్వోసీలు తీసుకురావడం సాధ్యమవుతుందేమో మంత్రివర్గ ఉప సంఘం చెప్పాలి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్​జిల్లాలో వేలాది ఎకరాల భూమి భూదాన్​యజ్ఞ బోర్డుకు సంబంధించిందంటూ ధరణి రికార్డుల్లో నమోదు చేశారు. సదురు బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకొస్తేనే సమస్యను పరిష్కరిస్తామంటూ కలెక్టర్లు రైతులకు సమాధానమిస్తున్నారు. భూదాన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏయే సర్వే నంబరులో ఎంత భూమి ఉన్నదో.. ఆ విస్తీర్ణానికి ఆటో లాక్​చేయడం వల్ల వేలాది మంది రైతులకు పీఓబీ ముప్పు తప్పుతుందని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed