ఆ శాఖలో ఉన్నతాధికారులు, ఉద్యోగ నేతల దోపిడీ

by  |
ఆ శాఖలో ఉన్నతాధికారులు, ఉద్యోగ నేతల దోపిడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జల వనరుల శాఖ పునర్విభజన ఉన్నతాధికారులు, ఉద్యోగ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఉద్యోగుల బదిలీల్లో వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. బదిలీల్లో నిబంధనలు అతిక్రమిస్తూ అయినవారి కోసం అడ్డదారుల్లో పోస్టింగ్‎లు ఇస్తున్నారు. సదరు శాఖ విభజనతో జిల్లాకో ఎస్‌ఈతో పాటు నాలుగు డివిజన్లు, నాలుగు సబ్​ డివిజన్లు ఏర్పాటయ్యాయి. వీటిలోనే ఉద్యోగులు, ఇంజినీర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా అధికారులు, కొంతమంది ఉద్యోగ సంఘనేతలు కలిసి అక్రమాలకు తెర లేపారు.

జల వనరుల శాఖ విభజన అనంతరం అన్ని జిల్లాలు, డివిజన్లకు మొత్తం 5 వేల మంది ఉద్యోగులు, ఇంజినీర్లను బదిలీ చేశారు. ఈ శాఖలో ఏళ్ల తరబడి ఉద్యోగులు ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. పలు కారణాలను సాకుగా చూపుతూ ఒకేచోట ఉండి చక్రం తిప్పుతున్నారు. పునర్విభజనలో వీరిని పలు ప్రాంతాలకు బదిలీచేసినా మళ్లీ యథాస్థానాలకు వచ్చేందుకు లక్షల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు. అధికారులతో ఉన్న సత్సంబంధాలతో బదిలీలు కూడా తేలిగ్గా జరుగుతున్నాయి. నిజానికి కొత్త డివిజన్ల ఏర్పాటు తర్వాత సీనియారిటీ ప్రకారం 40 శాతం, అడ్మినిస్ట్రేషన్​ కింద 30 శాతం ఉద్యోగుల కేటాయింపులు జరిపారు. సీసీఏ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఉండకుండా బదిలీలు నిర్వహించాలి. కానీ జల వనరుల శాఖల్లో దాదాపు 10 ఏండ్లకుపైగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న వారికి కూడా ఇప్పుడు మళ్లీ పాత స్థానాలకే తీసుకువచ్చారు. వారిపై అవినీతి, అక్రమాల ఆరోపణలున్నా అధికారులు, సంఘ నేతలకు అనుకూలంగా ఉంటుండంతో పాత స్థానాలకే తెచ్చుకుంటున్నారు. దీనిపై ఓ సర్కిల్​లో తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించి కోర్టు మొట్టికాయలు వేసినా అధికారుల తీరు మారడం లేదు.

అడిగింది ఇస్తే… అడిగిన కాడ పోస్టింగ్​

నీటిపారుదల శాఖ ఆప్షనల్ కేటాయింపుల్లో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఉద్యోగ సంఘాల నాయకులు, ఆ శాఖలోని కొంత మంది ఉన్నత స్థాయి అధికారులు, ఎంపిక కమిటీ సభ్యులు కుమ్మక్కై నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. చాలా మేరకు నిబంధనలను అతిక్రమించి అడిగిన కాడ పోస్టింగ్​లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెరిటోరియల్ యూనిట్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఆప్షనల్ అలాట్​మెంట్​కు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరిగాయంటున్నారు. ఈ శాఖలో నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి మొదలు సూపరింటెండెంట్​ స్థాయి ఉద్యోగుల వరకు బదిలీల కమిటీలు, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనల ప్రాతిపదికన బదిలీలు చేయకుండా కక్ష సాధింపుగా చేశారంటూ ఫిర్యాదులున్నాయి.

జలవనరుల శాఖలో విభాగాల్లోని అధికారులు సిబ్బందిని నూతనంగా ఏర్పాటైన ఈఎన్సీల పరిధికి కేటాయింపులు చేశారు. వీరికి తమ టెరిటోరియల్ యూనిట్ల పరిధిలో అవకాశం కల్పించారు. దీంతో ఉద్యోగులు సొంత జిల్లాలోని కార్యాలయాలకు ప్రాధాన్యతనిస్తూ దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఉద్యోగులు, ఇంజినీర్లకు దరఖాస్తు చేసుకున్న ప్రాంతాల్లో కేటాయించకుండా అధికారులు, ఉద్యోగ సంఘ నేతలు కలిసి చక్రం తిప్పారు. సీనియారిటీ, మెడికల్ గ్రౌండ్ కేసులో మాత్రమే ఉద్యోగులు కోరుకున్న చోటకు ప్రాధాన్యం కల్పించాల్సి ఉండగా, కొంత మంది మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో బేరాలు మాట్లాడుకుని బదిలీలు చేసినట్లుగా విమర్శలున్నాయి. దీంతో పైరవీలు చేసుకున్న ఉద్యోగులు శాఖ పునర్విభజనకు ముందు ఒకేచోట ఏండ్ల తరబడి పనిచేసిన ప్రాంతాలకే మళ్లీ వచ్చారు. ఇక ఉద్యోగ సంఘాల సహకారం లేని, పైరవీలు చేయని వారిని మాత్రం ఇతర ప్రాంతాలకు పంపించారు.

ఉదాహరణగా వరంగల్ సీఈ పరిధిలోకి కేటాయించబడిన కరీంనగర్ యూనిట్ ఉద్యోగి ఆప్షన్ అలాట్​మెంట్​లో కరీంనగర్ కోరుకోగా అక్కడ ఓ సంఘం నేత అనుచరుడికి పోస్టు దక్కించేందుకు అర్హత ఉన్న సదరు ఉద్యోగిని రామగుండం యూనిట్​కు కేటాయించారు. వరంగల్ యూనిట్​లో సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్​ స్థాయి మరో ముగ్గురు ఉద్యోగులు కరీంనగర్, వరంగల్​కు ఆప్షన్​ ఇచ్చుకోగా సంబంధం లేకుండా ములుగు యూనిట్​కు, అలాగే వరంగల్ నుంచి కరీంనగర్​కు ఆప్షన్ ఇచ్చుకున్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని రామగుండానికి కేటాయించారు. సదరు ఉద్యోగి గతంలో కోర్టు నుంచి పదోన్నతి తెచ్చుకున్న దృష్ట్యా ఆయన్ను కరీంనగర్ సిటీ పరిధిలో కేటాయించాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘించి వరంగల్​లోని యూనిట్​కు కేటాయించారు.

ఇలా నిబంధనలకు పాతరేసి మళ్లీ రామగుండం యూనిట్​కు పంపడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా కరీంనగర్​, వరంగల్​, మెదక్​, నిజామాబాద్​ వంటి టెరిటోరియల్​ యూనిట్లలో దాదాపు 150 మంది ఉద్యోగులను ఆప్షన్​ ఇచ్చిన ప్రాంతాలకు కాకుండా వేరే ప్రాంతాలకు పంపించారు. కానీ అదే స్థానాల్లో దాదాపు 15 ఏండ్ల నుంచి పని చేస్తున్న వారిని తిరిగి అక్కడే కూర్చుండబెట్టారు. ఎందుకంటే అటు అధికారులకు, ఇటు ఉద్యోగ సంఘాలకు సదరు ఉద్యోగులు అన్నింటినీ సర్దుబాటు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

గతంలో కరీంనగర్ జిల్లాలో పనిచేసిన ఓ సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులు పునర్విభజనలో భాగంగా గజ్వేల్ యూనిట్​కు కేటాయించగా తాజాగా రామగుండం బదిలీ అయ్యారు. కాగా, అధికారులు, ఉద్యోగ సంఘాలతో ఉన్న పలుకుబడితో తిరిగి పాత స్థానమైన కరీంనగర్​కే పోస్టింగ్​ వేయించుకున్నారు. ఇలా రాష్ట్రంలోని చాలా సర్కిళ్లలో ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అక్రమ బదిలీలపై ఉన్నతాధికారులకు సైతం విన్నవించినా మండలి ఎన్నికల నేపథ్యంలో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

అడ్డుకోవడం ఎలా..?

జల వనరుల శాఖ సీఎం దగ్గరే ఉంది. ఇప్పుడు పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల్లో లక్షలు వసూలు చేస్తూ నిబంధనలను పాతరేస్తున్నట్లు ఉన్నతాధికారులే చెబుతున్నారు. వీటిని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఉన్నతాధికారులకు నివేదించినా వారి వర్గంగా ఉన్న అధికారులు, ఉద్యోగ సంఘ నేతలు చెప్పినట్టే చేస్తున్నారు. ఫిర్యాదులను పక్కనేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా అడ్డుకోవాలనే అంశంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా చెప్పుకునే దిక్కు లేకపోవడంతో ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు, భూ సేకరణపై కోర్టు చుట్టూ తిరుగుతున్న జల వనరుల శాఖ అధికారులు ఇక బదిలీల వ్యవహారంలో కూడా కోర్టుకు వెళ్లనున్నారు.



Next Story

Most Viewed