ఇలా ఉండేది.. ఇలా అయ్యింది.. ఇలా కావాలనుకుంది

236

దిశ,వెబ్‌డెస్క్ : కొందరు సినిమా పిచ్చోళ్లుంటారు. హీరో తొడకోసుకుంటే అభిమాని మెడే కోసుకుంటారు. అభిమాన నటుడు తొడిగిన డ్రెస్. కొట్టించుకున్న కటింగ్. వేసుకున్న పాయింట్. గొరిగించుకున్న గడ్డం. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అందులో లేడీ అభిమానులు తక్కువేం కాదు. అరుందతి చీరలు. అనుష్క నగలు. సమంత డ్రెస్‌లు. రకుల్ ప్రతీ సింగ్ సోకులు. కాజోల్ అక్క కళ్లద్దాలంటూ తెగ ఫాలో అవుతుంటారు. కానీ అదంత అక్కడి వరకే పరిమితం అయితే బాగుంటుంది. శృతిమించితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలు పాలు కావాల్సి వస్తుంది.

హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలిని చూస్తే ఎవరికైనా అమ్మ బ్రహ్మ దేవుడో…కొంపముంచి నావురో. ఎంతగొప్పసొగసురో. యాడదాచినావురో అంటూ ఆమె అందాన్ని వర్ణించడానికి పోటీపడుతుంటారు. మరి అలాంటి అందం ఆమె ఒక్కరికే సొంతం. అలా అని అదే అందం అందరికి దక్కాలంటే సాధ్యం కాదు. ఓ అభిమాని ఏంజెలీనాపై ఉన్న పిచ్చితో కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. దీంతో మతపరమైన నిబంధనలను పక్కాగా అమలు చేసే ఇస్లామిక్ దేశంగా గుర్తింపు ఉన్న ఇరాన్ ప్రభుత్వం అభిమాని ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించింది. దైవ దూషణ కింద ఆమెపై కేసు నమోదు చేసి 10ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో అరెస్టైన అభిమాని తాజాగా విడుదలయ్యారు.

ఈ ఫొటోలో కనిపిస్తోన్న అమ్మాయి పేరు సహర్ తబర్. ఇరానియన్. సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటపడింది. ఆ గుర్తింపే ఆమెను కటకటాల పాలు చేసింది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలి తరహాలో తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నించింది. 50 సార్లకు పైగా కాస్మటిక్ సర్జరీ చేయించుకొని ఏంజెలీనా జోలీ జోంబీ క్యారెక్టర్ లో కనిపిస్తే ఎలా ఉంటారనే ఊహకు రూపాన్ని ఇవ్వడానికి సహర్.. తన రూపాన్ని మార్చుకున్నారు. చివరికి ఇలా అందవిహీనంగా తయారయ్యారు. దీంతో 2017లోనే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇరాన్ ప్రభుత్వం సహర్ ఉదంతంపై స్పందిస్తూ మతపరమైన నిబంధనలను పక్కాగా అమలు చేసింది. 10ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే తాజాగా 10ఏళ్లు జైలు శిక్షలో భాగంగా మూడేళ్లు శిక్షను పూర్తి చేసుకుంది. కొద్దిరోజుల క్రితం బెయిల్ పై విడుదలైంది. 10ఏళ్ల జైలు శిక్షకు సంబంధించింది సహర్ తబర్ తన తప్పును ఒప్పుకొని, జైలు శిక్షను తగ్గించాలని కోర్ట్ ను కోరనున్నట్లు ఆమె తరుపు లాయర్ తెలిపారు. జైలు శిక్షను అనుభవిస్తుండగా కరోనా సోకడం, సత్ప్రవర్తన కింద ఆమె విడుదల చేసినట్లు నేషనల్ మీడియా కథనాల్ని ప్రసారం చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..