క్రికెట్ అభిమానులకు శుభవార్త… హైదరాబాద్‌లో ఐపీఎల్?

by  |
క్రికెట్ అభిమానులకు శుభవార్త… హైదరాబాద్‌లో ఐపీఎల్?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ మినీ వేలం పాట తర్వాత చర్చంతా వేదికలపైనే జరుగుతున్నది. బీసీసీఐ 14వ సీజన్ కోసం ఐదు వేదికలను షార్ట్ లిస్ట్ చేసిందనే వార్తల నేపథ్యంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముంబయి, హైదరాబాద్, మొహలీ వేదికలను ఈ జాబితాలో చేర్చకపోవడంపై ఫ్రాంచైజీ యాజమాన్యాలే కాకుండా రాజకీయంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కారణంగానే 8 వేదికలను నిర్ణయించలేక పోతున్నామని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకే ప్రస్తుతానికి 5 వేదికలను షార్ట్ లిస్ట్ చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు కూడా లీకులు వదిలాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని.. అవసరమైన అన్ని అనుమతులను మేము ఇస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా కేటీఆర్ విజ్ఞప్తికి మద్దతు పలికారు. దీంతో బీసీసీఐ కూడా హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి అవకాశం ఉన్నదో లేదో అని సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది.

ముంబయిలో కష్టమే..

బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు వేదికలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబయి వాంఖడే స్టేడియంలో కూడా మ్యాచ్‌లు నిర్వహించాలని భావించింది. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ఉన్నతాధికారులతో బీసీసీఐ అధికారులు వేదిక విషయంపై చర్చలు జరిపినట్లు సమాచారం, అయితే మహారాష్ట్రలోనే కాకుండా రాజధాని ముంబయిలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఈ సమయంలో అనుమతులు మంజూరు చేయలేమని తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూలంగా సమాధానం రావడంతో ముంబయి బదులు హైదరాబాద్‌ను మరో వేదికగా నిర్ణయించేందుకు బీసీసీఐ పెద్దలు సిద్దమవుతున్నట్లు క్రీడా వర్గాలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే రెండో దశ వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించినందున ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ప్రేక్షకులను కూడా అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు హైదరాబాద్ వేదిక ఖరారయ్యే అవకాశాలు మెరుగయ్యాయి.

మొహలీలో కూడా కావాల్సిందే..

ఐపీఎల్‌ను తమ హోం గ్రౌండ్ అయిన మొహలీలో కూడా నిర్వహించాల్సిదేనని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గట్టిగా పట్టుబడుతున్నది. ఇప్పటి వరకు వేదికలపై బీసీసీఐ సమాచారం ఇవ్వకపోయినా పంజాబ్ కింగ్స్ యజమానుల్లో ఒకరైన నెస్ వాడియా స్పందించారు. బ్రాండింగ్ మార్చిన తర్వాత జరుగుతున్న ఐపీఎల్‌ను తాము హోం గ్రౌండ్‌లోనే ఆడాలని భావిస్తున్నామని.. అవసరమైతే కొన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకపోయినా తాము అంగీకరిస్తామని నెస్ వాడియా మీడియాకు తెలిపారు. ప్రేక్షకులను అనుమతించక పోవడం వల్ల గేట్ ఆదాయం కోల్పోతామని మేం భయపడటం లేదు. ఈ ఏడాది మ్యాచ్‌లు మా సొంత మైదానంలో ఆడాలనేదే మాకు ముఖ్యమని నెస్ వాడియా తెలిపారు. బీసీసీఐ ఇంకా ఏ ఫ్రాంచైజీకి కూడా అధికారికంగా వేదికలపై సమాచారం అందించలేదు. కానీ, ప్రస్తుతం వస్తున్న డిమాండ్లు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను చూసి మరో వారం 10 రోజుల్లో పూర్తి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది.

Next Story

Most Viewed