ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్స్

by  |
ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్స్
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే బీసీసీఐకి కాసులు కురిపించే లీగ్ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభను గుర్తించడానికి ఉపయోగపడే ఒక వేదికలా మారింది. కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్‌కు అభిమానుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. దీంతోపాటే బీసీసీఐకి ఆదాయమూ పెరిగింది. మరోవైపు వరుణ్ చక్రవర్తి, టి.నటరాజన్, తెవాతియా, సూర్యకుమార్ యాదవ్ వంటి యువకుల ప్రతిభ అందరికీ తెలిసొచ్చింది. నటరాజన్ అయితే ఏకంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో 13వ సీజన్ ముగిసినప్పట్నుంచే మరిన్ని టీమ్‌లను లీగ్‌లో చేర్పించాలనే డిమాండ్ పెరిగింది. దీనిపై కొన్నాళ్లుగా పలు కార్పొరేట్ కంపెనీలు ఒత్తిడి తేవడంతో బీసీసీఐ సూత్రప్రాయంగా రెండు జట్లను చేర్చడానికి ఒప్పుకుంది. ఈ నెల 24న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహించడానికి నిర్ణయించింది. ఈ సమావేశంలో రెండు జట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అహ్మదాబాద్‌ కోసం తీవ్రమైన పోటీ

ఐపీఎల్‌లో చేర్చాలనుకునే రెండు జట్లలో ఒకటి అహ్మదాబాద్ సిటీ నుంచి ఉండనున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లో ఇటీవలే ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు. మొతెరా గ్రౌండ్ కొత్త జట్టుకు హోం గ్రౌండ్ కావడం వల్ల అనేక బడా కార్పొరేట్ కంపెనీలు ఈ జట్టుపై కన్నేశాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్, సంజీవ్ గోయాంకా వంటి కంపెనీలు ఈ జట్టును దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. గౌతమ్ అదానీ ఎప్పట్నుంచో ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ దక్కించుకోవాలని ఎదురుచూస్తున్నారు. పాత ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు పెట్టడం కంటే, ఓ కొత్త ఫ్రాంచైజీకి యజమానిగా ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు అహ్మదాబాద్ సిటీ జట్టయితేనే కలిసొస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు గతంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీని రెండేళ్లపాటు నిర్వహించిన సంజయ్ గోయాంక కూడా కొత్త జట్టుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన కూడా అహ్మదాబాద్ సిటీ ఫ్రాంచైజీపై కన్నేశారు. అయితే, బిడ్డింగ్‌లో ఎవరికి అహ్మదాబాద్ ఫ్రాంచైజీ లభిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

రెండో టీమ్ ఎక్కడి నుంచి.?

ఇండియాలో ఐపీఎల్ ఫ్యాన్ బేస్‌ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ రెండు కొత్త టీమ్స్‌ను చేర్చబోతున్నది. రెండో టీమ్ కేరళ, పూణే లేదా నార్త్‌ఈస్ట్ నుంచి తీసుకురావాలని భావిస్తున్నది. పూణే, కేరళలో గతంలో ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి. ఇక నార్త్‌ఈస్ట్ అంటే గౌహతి నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే, గౌహతిలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనేదానిపై కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నది. పూణే టీమ్ అయితే మహారాష్ట్రకే రెండు ఐపీఎల్ టీమ్స్ దక్కినట్లు అవుతుంది. అందుకే గతంలో ఉన్న కోచీ టస్కర్స్‌లాగే అక్కడి నుంచి మరో టీమ్ తీసుకురావాలని భావిస్తున్నది. అయితే, ఐపీఎల్-14వ సీజన్‌ను బీసీసీఐ ఇండియాలోనే నిర్వహించాలని చూస్తుండటం, దానికి మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కొత్త టీమ్స్ చేరిక, మెగా వేలం సాధ్యం అవుతాయా లేదా అనేదానిపై ఏజీఎంలో చర్చకు రానున్నది. ఐపీఎల్ 14పై ఈ సమావేశంలోనే పూర్తి స్పష్టత వస్తుందని, ఐపీఎల్ గవర్నింగ్ బాడీతోపాటు బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా సూచనలు కూడా తీసుకుంటారని ఒక అధికారి తెలిపారు.

Next Story