రాజస్థాన్ తలరాత మారుతుందా?

by  |
రాజస్థాన్ తలరాత మారుతుందా?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ జట్టును చూస్తే ఎలాంటి స్టార్ ప్లేయర్లు, హార్డ్ హిట్టర్లు కనిపించరు. షేన్ వార్న్ కెప్టెన్సీలో అనామక జట్టుగా బరిలోకి దిగి ఎవరి అంచనాలకు అందకుండా ఏకంగా విజేతగా నిలిచింది. ఇక ఆ సీజన్ తప్ప మిగతా అన్ని సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుది పేలవ ప్రదర్శనే. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీ పడేలా వారి ఆటతీరు ఉంటుంది. గత ఏడాది అట్టడుగు నిలిచిన రాజస్థాన్ జట్టుకు తల రాత ఎప్పుడు మారుతుందో యాజమాన్యానికి కూడా అర్థం కావడం లేదు. గత రెండు సీజన్లుగా జట్టును చూస్తే స్టార్ క్రికెటర్లతో నిండి ఉంటుంది. టీ20లో దూకుడైన ఆటకు మారుపేరైన జాస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి వారితో పాటు సంజూ శాంసన్ వంటి క్లాసైన ప్లేయర్ కూడా ఉన్నాడు. కానీ స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాయల్స్ జట్టు 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి స్టీవ్ స్మిత్‌ను విడుదల చేసిన రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించింది. క్రిస్ మోరిస్, లియామ్ లివింగ్‌స్టన్, శివమ్ దూబే వంటి క్రికెటర్లను వేలంలో కొని జట్టు బలం పెంచుకున్నది.

బ్యాటింగ్‌కు తిరుగు లేదు..

రాజస్థాన్ జట్టులో పేరు మోసిన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఈ జట్టులో బ్యాటింగ్‌కే పరిమితం అయ్యే క్రికెటర్ల కంటే ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం జట్టుకు కలసి వచ్చే అంశం. జాస్ బట్లర్, సంజూ శాంసన్ లేదా బెన్ స్టోక్స్ ఈ సారి ఓపెనర్లుగా దిగే అవకాశం ఉన్నది. బట్లర్, స్టోక్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సంజూ శాంసన్ గత సీజన్‌లో కొన్ని విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. యువ క్రికెటర్లు మహిపాల్ లామ్రోర్, యశస్వి జైస్వాల్ తమను తాను నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. వీరికి సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్‌లో క్రిస్ మోరీస్, శివమ్ దూబే, రాహుల్ తెవాతియా, శ్రేయస్ గోపాల్, రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేయగల సత్తా కలవారే. రాహుల్ తెవాతియా మంచి ఫినిషర్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఆల్‌రౌండర్లు, మంచి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా.. వారి నిలకడలేమి గత సీజన్‌లో దెబ్బతీసింది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేసి వికెట్లు తేలికగా పారేసుకోకుండా చూసుకోవాలి.

ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటు..

రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్‌ది కీలక పాత్ర. గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ కోసం తీవ్రంగా పోడీ పడుతూ వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు దూరం అవడంతో రాజస్థాన్ కీలక ఆటగాడిని కోల్పోయింది. జయదేవ్ ఉనద్కత్, ఆండ్రూటై, ముస్తఫిజుర్ రెహ్మాన్ లలో ఒకరు బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నది. ఈసారి అందరి చూపు యువ క్రికెటర్ చేతన్ సకారియాపై ఉన్నది. రాజస్థాన్ జట్టు అతడిని రూ. 1.2 కోట్లకు కొన్నది. నిలకడైన బౌలింగ్‌కు సకారియా మారుపేరు. దేశవాళీ క్రికెట్‌లో అతడికి మంచి రికార్డు ఉన్నది. మయాంక్ మార్కండే, కరియప్ప మంచి స్పిన్నర్లు. వీరికి తోడు బెన్ స్టోక్స్, క్రిస్ మోరీస్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగలరు. ఈ సారి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతున్న రాయల్స్ జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు అయినా చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పూర్తి జట్టు : డేవిడ్ మిల్లర్, మన్నన్ వోహ్రా, లియామ్ లివింగ్‌స్టన్, మహిపాల్ లామ్రోర్, యశస్వి జైస్వాల్, క్రిస్ మోరిస్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాతియా, శివమ్ దూబే, శ్రేయస్ గోపాల్, రియాన్ పరాగ్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), అనుజ్ రావత్, కేసీ కరియప్పా, మయాంక్ మార్కాండే, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, ముస్తఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగీ, ఆకాశ్ సింగ్

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు

పంజాబ్ – ఏప్రిల్ 12
ఢిల్లీ – ఏప్రిల్ 15
చెన్నై – ఏప్రిల్ 19
బెంగళూరు – ఏప్రిల్ 22
కోల్‌కతా – ఏప్రిల్ 24
ముంబై – ఏప్రిల్ 29
హైదరాబాద్ – మే 2
చెన్నై – మే 5
ముంబై – మే 8
ఢిల్లీ – మే 11
హైదరాబాద్ – మే 13
బెంగళూరు – మే 16
కోల్‌కతా – మే 18
పంజాబ్ – మే 22

గత సీజన్‌లో 8వ స్థానం

Next Story

Most Viewed