మరణించిన జర్నలిస్టుల కుటుంబాల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

by  |
Allam Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్‌తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఈ ఆర్థికసాయం పొందేందుకు కొవిడ్‌తో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబీకులు జూలై 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

అలాగే బాధిత కుటుంబీకులకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. జర్నలిస్టుల పిల్లలు పదో తరగతిలోపు చదువుకుంటున్నవారిలో గరిష్టంగా ఇద్దరికీ రూ.1000 చొప్పున అందించనున్నట్లు అల్లం పేర్కొన్నారు. కొవిడ్-19తో మరణించిన జర్నలిస్టు కుటుంబీకులు దరఖాస్తుతోపాటు అక్రిడిటేషన్, ఐడీ కార్డు, ఆధార్ కార్డు, రూ.రెండు లక్షలలోపు ఆదాయ సర్టిఫికెట్, బ్యాంకు పాసు పుస్తకం, మూడు ఫొటోలు కావాలన్నారు. అలాగే జిల్లా వైద్యాధికారి జారీ చేసిన మరణ ధృవీకరణపత్రంతో పాటు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి ధృవీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి కానీ, పోస్ట్ ద్వారా కానీ ఈనెల 25వ తేదీ వరకు పంపించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

దరఖాస్తులను ‘కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్. ఇంటి నంబర్ 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్’ చిరునామాకు పంపాలని ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు 7702526489 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కాగా, గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చైర్మన్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed