యోగా డే : శరీరాన్ని విల్లులా వంచిన బామ్మ

by  |
Yoga Bamma in peddapelli
X

దిశ, పెద్దపల్లి: నేడు ప్రంపచంమంతా యోగాపై దృష్టి సారించింది. శారీరక, మానసిక ధృడత్వం కోసం భారతీయులకు పూర్వీకుల నుండి సంక్రమించిన ఈ విధానంపై ఇప్పుడు అందరూ ఆకర్షితులు అవుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ యోగాతో కాలం వెల్లదీసే వారు ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడు దశాబ్దాలుగా యోగా చేస్తోంది ఈ బామ్మ. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి నేటి తరానికి చెప్తే తప్ప తెలియదు… కానీ ఈమె మాత్రం యోగాతోనే జీవితాన్ని ప్రారంభిస్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరుకు చెందిన జీరూరు కనకలక్ష్మీ గత 30 ఏళ్లుగా యోగాతోనే తన దినచర్యను చేపడుతున్నారు. శరీరాన్ని విల్లులా వంచుతూ కష్టతరమైన ఆసనాలను అవలీలగా వేస్తున్నారు. 89 ఏళ్ల బామ్మ నేటి తరానికి ఆదర్శప్రాయమనే చెప్పాలి.

తెల్లవారు జామున 4 గంటలకు నిద్ర లేవగానే యోగాసనాలు వేస్తుంటారు. తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వైద్యుల సూచనల మేరకు అరవై ఏళ్ల వయసులో యోగా నేర్చుకున్నారు. యోగా బామ్మ అని ముద్దుగా పిలుచుకునే కనక లక్ష్మీని చూసిన గ్రామస్థులు కూడా యోగా చేసేందుకు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఇప్పటికీ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారంటే ఆమె ఆరోగ్యంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు పదుల వయసు దాటగానే కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేటితరానికి ఈ బామ్మ రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పాలి. రోజుకు గంట సేపు కెటాయిస్తే రోగాలు దరి చేరవన్న విషయాన్ని విస్మరిస్తున్న నేటి తరం ఓబెసిటీ వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సంతానం ఉద్యోగాలు చేస్తున్నందున వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. అయితే కనక లక్ష్మీ మాత్రం తన భర్తతో కలిసి సొంత ఊరిలోనే జీవనం సాగిస్తున్నారు. నిరంతరం యోగా చేస్తే ఆరోగ్యకరమైన జీవితంతో గడపవచ్చని అంటున్నారు బామ్మ. బామ్మను ఆదర్శంగా తీసుకుని మనమూ యోగా చేస్తూ ఆరోగ్య జీవనం గడుపుదాం.

కరోనా సమయంలో ‘ఆశా కిరణం’ యోగ : ప్రధాని

Next Story

Most Viewed