సెలబ్రిటీల సర్వ యోగా..

by  |
సెలబ్రిటీల సర్వ యోగా..
X

‘యోగా అంటే ఐక్యం. మీరు, మిగిలిన సృష్టి.. రెండూ ఏకంకావడం. పూర్తి విశ్వమే మీలో భాగం కావడం’. గ్రహణశీలతను పెంచి.. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేసే యోగా.. అంతర్గత అనుసంధానం ద్వారా ఆరోగ్యం, అందం, ఆత్మసంతృప్తిని అందిస్తుంది. పరమైక్యత దిశలో పయనింపజేస్తుంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా వల్ల కలిగే లాభాలు, అద్భుతాలు.. యోగాభ్యాసనం ద్వారా మనసు చేసే మాయ గురించి ప్రత్యక్ష అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు సెలబ్రిటీలు.

‘యోగా’ అనేది తన జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చిందని చెప్తోంది శిల్పా శెట్టి. యోగాభ్యాసనం వల్ల జీవితంలో స్వేచ్ఛ, శాంతి లభిస్తాయని తెలిపిన శిల్ప.. ఈ సందర్భంగా ‘జను శీర్షాసనం’ ప్రాముఖ్యతను వివరించింది. రోజూ ఈ ఆసనం వేయడం ద్వారా ఉదరం, వెన్నెముక, కండరాలు బలోపేతం అవుతాయని తెలిపింది. పేగుల పనితీరును మెరుగుపరిచి.. జీర్ణక్రియను పెంచుతుందని సూచించింది.

‘సర్వ యోగా, దివా యోగా’ కో ఫౌండర్ అయిన మలైకా అరోరా యోగాభ్యసనంలో ముందుంటారు. యోగాలో తనకు తెలిసిన నైపుణ్యాలు, అనుభవాలను పంచుకుంటూ.. మీ రోజును యోగాతో ప్రారంభించి చూడండి మీ జీవితంలో ఎంత మార్పు కనిపిస్తుందో గ్రహించమని చెప్తుంటుంది. ‘14 డేస్ 14 ఆసన్’ పేరుతో సోషల్ మీడియాలో యోగా అవసరాన్ని గుర్తించాలని పిలుపునిచ్చిన మలైకా.. హలాసన్ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ ఆసనం నాడీ వ్యవస్థ మీద భారీ ప్రభావం చూపుతుందని తెలిపింది. శరీరంతో పాటు మనసులోని టాక్సిన్స్‌ను బయటకు పంపించే గొప్ప సాధనం అని చెప్పింది.‘మనల్ని మనం సరెండర్ చేసుకుని.. శరీరం, మనసును ఏకం చేసే యోగా మనిషిలో మార్పునకు నాంది పలుకుతుంది’ అని చెబుతోంది రాశి ఖన్నా. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉష్ట్రాసన ప్రాముఖ్యత, లాభం గురించి వివరించింది. ఈ ఆసనం శ్వాస క్రియను మెరుగుపరుస్తుందని, వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తుందని చెప్పింది. ఉదర ప్రాంతాన్ని విస్తరింపజేసి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పింది. తొడలపై కొవ్వు తగ్గించి.. భుజాలు, వెనుక భాగాన్ని తగ్గిస్తుందని చెప్పింది.

యోగాతోనే అసలైన ఆనందాన్ని పొందగలరని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంట్లోనే ఫ్యామిలీతో యోగా చేయమని సూచిస్తూ.. భుజంగాసనం ద్వారా కలిగే లాభాలను వివరించింది. ఈ ఆసనం మానసిక స్థితిని పెంచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి.. హృదయాన్ని శక్తివంతం చేస్తుందని తెలిపింది. వెన్నెముకను బలంగా చేస్తూ.. మహిళల్లో రుతుక్రమం సమస్యలను తగ్గిస్తుందని వెల్లడించింది.



Next Story