ఈటల ఆస్తులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
ఈటల ఆస్తులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తోన్న భూ కబ్జాల ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈటల రాజేందర్‌తో పాటు అవినీతి ఆరోపణలు వచ్చిన మిగిలిన టీఆర్ఎస్ నేతల పరిస్థితేందంటూ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఆ భూములను కబ్జా చేస్తుంటే.. ఇన్నాళ్లు రైతులు, అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటలను కావాలనే టార్గెట్ చేశారని, ఆయన నిజాయితీగా ఆస్తులు సంపాదించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో అక్రమాలు జరుగుతుంటే కలెక్టర్ ధర్మారెడ్డి ఏం చేశారని ఆగ్రహించారు.

తమపై ఒత్తిడి వచ్చినా.. లొంగలేదని అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులు చెబుతున్నారు.. మరి మిగిలిన అవినీతి టీఆర్ఎస్ నేతలను ఎందుకు వదిలేస్తున్నారని అడిగారు. మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలను ఎందుకు ఇంతకాలం విచారణ చేయలేదని అన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అక్రమాలు చేసిన నయీం కేసును ఇంతవరకూ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. అన్యక్రాంతమైన వక్ఫ్, దేవాదాయ భూముల్ని ఎందుకు కాపాడటం లేదని, కేవలం ఈటలకు పెరుగుతున్న గ్రాఫ్ చూసే తప్పించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Next Story

Most Viewed