సెప్టెంబర్‌లో ఇంటర్ పరీక్షలు.. థర్డ్ వేవ్ వస్తే..?

by  |
సెప్టెంబర్‌లో ఇంటర్ పరీక్షలు.. థర్డ్ వేవ్ వస్తే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: థర్డ్ వేవ్ రాకముందే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందకు ఇంటర్ బోర్డ్ ఆలోచనలు చేస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్ నెలలో పూర్తి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పరీక్షా సమయాన్ని 1.30గంటలకు కుదించి, ప్రశ్నలను తగ్గించి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించి వాటి ఆధారంగా ఫస్టీయర్ మార్కులు కేటాయించాలని అధ్యాపక సంఘాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది ఫస్టీయర్ పరీక్షలు రాయకుండా సెకండ్ ఇయర్ కు 4,80,808 మంది విద్యార్థులు ప్రమోటయ్యారు.

కరోనా కారణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోవడం వలన విద్యా నైపుణ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కేవలం ఆన్ లైన్ తరగతుల బోధనలు మాత్రమే నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు సీరియస్ లేకుండా పోయింది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు విద్యావ్యవస్థలను గాడిలో పెట్టేందుకు పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ అభిప్రాయపడుతుంది. గత నెల రోజులుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాటిని స్పూర్తిగా తీసుకొని ఇంటర్ ఫస్టీయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నారు.

థర్డ్ వేవ్ రాకముందే పరీక్షల నిర్వహణ

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, రకరకాల కొత్త వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ రాకముందే ఇంటర్ ఫస్టీయర్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్ నెలలో పరీక్షలను ఏర్పాటు చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. 50శాతం ప్రశ్నా పత్రాలతో పరీక్షా సమయాన్ని 1.30గంటలకు కుదించి పరీక్షలు నిర్వహించాలని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సమగ్ర నివేదికను తయారు చేసి పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించనున్నారు.

విద్యార్థులను సన్నద్ధం చేయనున్న ఇంటర్ బోర్డ్

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఆల్ పాస్ చేసిన ప్రభుత్వం ఫస్టీ ఇయర్ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి ప్రమోట్ చేశారు. ఫస్టీయర్ నుంచి సెకండ్ ఇయర్ కు ఈ ఏడాది 4,80,808 మంది విద్యార్థులు ప్రమోటవగా వీరిలో 2,36,430 మంది బాలురు, 2,44,378 మంది బాలికలున్నారు. వీరందరికి ప్రస్తుతం సెకండ్ తరగతులను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాల్సి వస్తే ముందస్తుగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఇంటర్ బోర్డ్ ఆలోచనలు చేస్తుంది. పరీక్షలకు 15 రోజుల ముందుగానే అన్ని సబ్జెక్టులపై రివిజన్ కార్యక్రమాన్నిచేపట్టనున్నారు. పరీక్ష ప్రశ్నా ప్రతాల మాడల్ ను విద్యార్థులకు వివరించి పరీక్షలకు సిద్ధం చేయనున్నారు.

సెకండ్ ఇయర్ ఆధారంగా మార్కులు కేటాయించాలని సూచనలు

కరోనా తీవ్రత పెరిగి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు పునరావృతమవుతే విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని అధ్యాపక సంఘాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ ఇయర్ కు అర్ధవార్షిక పరీక్షలను, వార్షిక పరీక్షలను నిర్వహించిన వాటి మార్కుల ఆధారంగా ఫస్టీయర్ మార్కులను కేటాయించాలని సూచిస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికి విద్యార్థుల భవిష్యత్తును, ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని కార్యచరణ చేపట్టాలని సూచిస్తున్నారు.


పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు నిర్వహించాలి

పరిస్థితులు అనుకూలిస్తే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం. థర్డ్ వేవ్ ముప్పు ఏర్పడితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణ అంశాలను విరమించుకోవాలి. గతంలో ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులను కేటాయించాం. ఈ సారి కూడా సెకండ్ ఇయర్ మార్కులు ఎలా ఇచ్చామో.. అలా ఫస్టియర్ మార్కులను కేటాయించాలని సూచిస్తున్నాం.
-మాచర్ల రామకృష్ణ గౌడ్ , తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్

Next Story

Most Viewed