30 రోజుల్లోనే బీమా అందజేయాలి.. జగన్ సర్కార్ ఆదేశాలు

by  |
30 రోజుల్లోనే బీమా అందజేయాలి.. జగన్ సర్కార్ ఆదేశాలు
X

దిశ, ఏపీ బ్యూరో: పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి చనిపోయినప్పుడు పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు అండగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం వైఎస్సార్ బీమా. ఈ పథకం ద్వారా బీమా పరిహార ఆర్థిక సహాయాన్ని సత్వరమే బాధిత కుటుంబాలకు అందించడం ద్వారా ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించిన వారవుతామని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా, రైతులు ఆత్మహత్య, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్‌ పశునష్ట పరిహారం వంటి నాలుగు విభాగాల బీమా పథకాలను అమలు చేస్తోంది. అయితే ఈ పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4 రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు విడుదల చేసింది. ఈ క్లెయిమ్ పరిష్కరాలకు సంబంధించి పూర్తి బాధ్యతను జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి) అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

వైఎస్సార్‌ బీమా, రైతులు ఆత్మహత్య, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్‌ పశునష్ట పరిహారం పథకాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడమే కాకుండా క్లెయిమ్‌ సొమ్మును సంబంధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే వాలంటీర్ల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీమా క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం జరుగుతున్న విషయం వెలుగులోకి రావడంతో సీఎం జగన్ వైఎస్సార్ బీమా పథకంలో అనేక మార్పులు చేశారు.

అందులో భాగంగా ఈ బీమా పథకాల పరిహారం అందజేసే బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయలకు అప్పగించింది. ఈ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం జాయింట్‌ కలెక్టర్‌ 15 రోజులకోసారి జిల్లా, మండల, పట్టణ స్థానికసంస్థల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని.. అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించి తుది నివేదికను గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Next Story

Most Viewed