అధిపత్య పోరులో జాతీయ జెండాకు అవమానం

by  |
అధిపత్య పోరులో జాతీయ జెండాకు అవమానం
X

దిశ, శేరిలింగంపల్లి : అధికార పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు మంగళవారం గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం కల్గించేందుకు కారణమైంది. చందానగర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి స్థానిక గాంధీ విగ్ర‌హం వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర‌వేశారు. కొద్దిసేప‌టి త‌ర్వాత ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన మంజుల ర‌ఘునాథ్‌‌రెడ్డి అనుచ‌రులు ఆ జెండాను తొల‌గించి మ‌రో జెండాను ఏర్పాటు చేశారు. దానిని మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి ఎగర‌వేశారు. ఈ విష‌యం గ‌మ‌నించిన న‌వ‌తారెడ్డి తాను ఎగుర‌వేసిన జెండాను వెంట‌నే ఎలా తొల‌గిస్తారని ప్ర‌శ్నించడంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం చందాన‌గర్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ముందే ఎగరవేసిన జెండాను, అక్కడున్న గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలను తొలగించి జెండాకు అవమానపరిచినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బొబ్బ నవతారెడ్డి డిమాండ్ చేశారు. తాము ఏర్పాట్లు చేసిన వద్ద ఎవరికీ సమాచారం లేకుండా నవతారెడ్డి వచ్చి జెండా ఎగరవేశారని, తమకు సమాచారం ఇచ్చి వచ్చి ఉంటే ఆమె చేతుల మీదుగానే ఎగరవేయించేవారమని టీఆర్ఎస్ డివిజ‌న్ అధ్య‌క్షుడు ర‌ఘునాథ్‌రెడ్డి తెలిపారు. అయితే తాము జెండా వెగరవేసి జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు నవతారెడ్డి కూర్చొని జాతీయ గీతాన్ని అవమానించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించామని విచారించి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్ట‌ర్ తెలిపారు.


Next Story