మంత్రి పువ్వాడ సమక్షంలో ఎమ్మెల్యే రేగాకు ఘోర అవమానం (వీడియో)

by  |
MLA Rega Kantha Rao
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ సాక్షిగా ఆదివాసీ ప్రజాప్రతినిధికి తీవ్ర అవమానం జరిగింది. ఈ ఘటనతో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతం అయింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం వాటర్ ఫౌంటేన్, 13 అడుగుల భారీ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణతో పాటు సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం పోస్టాఫీస్ సెంటర్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. అయితే, ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కూడా ఆహ్వానం అందగా ఆయన సైతం కార్యక్రమానికి వచ్చారు. ఇదిలా ఉంటే అధికారులు ప్రొటోకాల్ ప్రకారం అందరినీ స్టేజీ మీదకు ఆహ్వానించాలి కానీ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ అధికారిక కార్యక్రమంలో అన్నీ తానై హల్‌చల్ చేశారు. అంతేకాదు.. మంత్రి సహా తనకు అనుకూలమైన వారిని స్టేజీ మీదకు పిలిపించి ప్రభుత్వ విప్ రేగా కాంతారావును ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారు.

అంతేకాదు.. సభ జరిగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వనమా, రాఘవ ఫొటోలే ముద్రించారు. సభా వేదికపై ఉన్న ఫ్లెక్సీలో కూడా ప్రభుత్వ విప్ ఫొటో ముద్రించలేదు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన రేగా కాంతారావు ఈ చర్యను తప్పుపట్టారు. గమనించిన రాఘవ రేగాను స్టేజీ మీదకు తీసుకెళ్లేందుకు తన వద్దకు రాగా.. తాను రానంటే రానంటూ కినుకు వహించారు. పిలిచి అవమాన పరుస్తారా..? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ అయిన తనను ప్రొటోకాల్ పాటించకుండా ఇలాచేస్తారా..? మాకూ టైం వస్తుందంటూ రాఘవను నిలదీశారు. చివరికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వచ్చి సర్ది చెప్పి రేగాను స్టేజీ మీదకు తీసుకెళ్లారు.

ఆదివాసీ బిడ్డను అవమాన పరుస్తారా..?

తనకు జరిగిన అవమానాన్ని రేగా కాంతారావు తీవ్రంగా తప్పుబట్టారు. స్టేజీపై ప్రసంగిస్తూ అంబేద్కర్ సాక్షిగా తనకు అవమానం జరిగిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డను అధికారిక కార్యక్రమానికి పిలిచి ఇలా చేస్తారా..? ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ విప్‌ను కనీసం ఆహ్వానించరా..? అంటూ మండిపడ్డారు. కనీసం ఫ్లెక్సీలో ఫొటో కూడా లేదంటూ మంత్రి ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇలా మరోసారి జరగకుండా జాగ్రత్తగా ఉండాలంటూ తనదైన స్టైల్లో చెప్పారు.

రాఘవ తీరుపై మండిపడ్డ విప్..

అధికారిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ కావొద్దని ఇటీవల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారని, అయినా కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు రాఘవ అధికారిక కార్యక్రమంలో పెత్తనం ఎలా చెలాయిస్తారంటూ విప్ రేగా మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించాల్సిందిపోయి ఆయనే ఇష్టం వచ్చిన వారిని పిలిచి తనను అవమాన పరిచారంటూ ‘దిశ’ ప్రతినిధికి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు.

మొదటి నుంచీ రాఘవ అంతే..

కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగిన అది పూర్తిగా రాఘవ కనుసన్నల్లోనే జరుగుతుందనేది మొదటి నుంచీ ఉంది. అధికారుల నుంచి కిందిస్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఆయన చెప్పినట్లే చేయాలని ఆదేశాలు జారీ చేస్తారట. లేకుంటే రాఘవ అనుచరుల వేధింపులు తప్పవు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో చాలానే పునరావృతం అయ్యాయి. ఇటీవల ఆయన పెత్తనం గురించి నియోజకవర్గంలో చర్చ జరగడంతో.. ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లి సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ విప్ రేగాకు అవమానం జరగడం, ఆయన మంత్రి అజయ్ ముందే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం రాఘవ తీరుపై మళ్లీ చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed