గాడిన పడుతున్న దేశీయ ఆతిథ్య రంగం!

by  |
గాడిన పడుతున్న దేశీయ ఆతిథ్య రంగం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆతిథ్య రంగం గాడిన పడుతోందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఆతిథ్య రంగం ఈ ఏడాది 169.4 శాతం వృద్ధిని నమోదు చేసిందని జేఎల్ఎల్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా ప్రయాణాలు కుంటుపడ్డాయి. ఆ తర్వాత ప్రయాణ ఆంక్షలు సడలించడంతో సమీక్షించిన త్రైమాసికంలో సగటున ఒక గది ఆదాయం 122.9 శాతం వృద్ధి అందుకుందని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.

గతేడాది కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా వృద్ధి అధికంగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ధోరణిలోనే కొనసాగితే రాబోయే రెండు త్రైమాసికాల్లో ప్రయాణాలు మెరుగ్గా కొనసాగుతాయనే అంచనాలున్నాయి. ఐటీ, ఐటీ సంబంధిత కంపెనీలు రానున్న రోజుల్లో ప్రయాణ ఖర్చులను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఉద్యోగులు సైతం ఇటీవల ప్రయణాలు చేయడం పెరిగింది. దీనివల్ల ఆతిథ్య రంగంలో హోటళ్ల వినియోగం పెరగడం, సగటు రేట్లు అధికమవడం లాంటి పరిణామాలు ఈ రంగానికి మద్దతిస్తాయని జేఎల్ఎల్ వివరించింది. నగరాల వారీగా చూస్తే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో గోవా ఆతిథ్య రంగంలోని సగటు గది అద్దె ధర 389.8 శాతం వృద్ధి నమోదు చేసింది.

ఆక్యుపెన్సీ పరంగా హైదరాబాద్ అధికంగా 33.6 శాతం వృద్ధి సాధించింది. సగటు గది అద్దె ధర పరంగా హైదరాబాద్ 173.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ‘ఆతిథ్య రంగం ఈ ఏడాది సెకెండ్ వేవ్ తర్వాత బలమైన రికవరీని సాధించింది. దేశీయ పర్యాటకులు దేశవ్యాప్తంగా ప్రయాణాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండటం సానుకూల అంశమని’ జేఎల్ఎల్ హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జైదీప్ డాంగ్ అన్నారు.



Next Story

Most Viewed