కరోనా సెకెండ్ వేవ్‌తో తగ్గిన ఇంధన అమ్మకాలు

by  |
కరోనా సెకెండ్ వేవ్‌తో తగ్గిన ఇంధన అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ఇంధన అమ్మకాలు దెబ్బతిన్నాయి. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలతో డిమాండ్ క్షీణించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం ఇంధన డిమాండ్ 2019 కరోనాకు ముందు స్థాయిలో 7 శాతం తగ్గినట్టు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) మార్కెటింగ్, రిఫైనరీ డైరెక్టర్ అరుణ్ సింగ్ చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో భారత్ కఠినమైన లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఉంది. దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఇంధన అమ్మకాలు సగానికి పడిపోయాయి. ఈ క్రమంలో గతేడాది అమ్మకాలతో గత నెల గణాంకాలను పోల్చలేమని అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్ల సమాచారం ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 21.4 లక్షల టన్నులకు పడిపోయాయి.

అంతకుముందు మార్చి నెల కంటే ఇది 6.3 శాతం తక్కువ. 2019, ఏప్రిల్‌తో పోలిస్తే 4.1 శాతం తక్కువ. ఇక డీజిల్ డిమాండ్ 59 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. మార్చితో పోలిస్తే 1.7 శాతం, 2019 ఏప్రిల్‌తో పోలిస్తే 9.9 శాతం క్షీణించింది. విమానయాన సంస్థలు సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో జెట్ ఇంధన అమ్మకాలు 3,77,000 టన్నులుగా నమోదయ్యాయి. ఇది మార్చితో పోలిస్తే 11.5 శాతం తక్కువ, 2019 ఏప్రిల్‌తో పోలిస్తే 39.1 శాతం క్షీణత. అదేవిధంగా వంట గ్యాస్ ఎల్‌పీజీ అమ్మకాల పరిమాణం 3.3 శాతం తగ్గి 21 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఏప్రిల్‌తో పోలిస్తే 11.6 శాతం ఎక్కువ.


Next Story

Most Viewed