తొలి త్రైమాసికంలో బలహీనంగా వృద్ధి రేటు!

by  |
తొలి త్రైమాసికంలో బలహీనంగా వృద్ధి రేటు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోనుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. గతేడాదిలో ఆర్థిక మందగమనం వల్ల ఇబ్బందులొచ్చాయని, తర్వాత కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లతో భారత్ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిందని వారు అభిప్రాయపడ్డారు. మే 20 నుంచి 25 మధ్య 52 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్న పోల్‌లో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కార్యకలాపాలు బాగానే ఉన్నప్పటికీ, మార్చి చివరి నుంచి లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రభావం ఎక్కువగా ఉందని హెచ్ఎస్‌బీసీ ఎకానమిస్ట్ ఆయూష్ చౌదరీ తెలిపారు. ఈ పోల్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. మార్చి నెలలో వృద్ధి రేటు 2.1 శాతంగా ఉండొచ్చని, ఇది 2012 నాటి అత్యంత బలహీన వృద్ధి అని పేర్కొన్నారు.

జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు సంబంధించిన డేటా ఈ నెల 29న విడుదల కానుంది. ఇది 4.5 శాతం నుంచి మైనస్ 1.5 శాతం మధ్యన ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ పోల్‌లో పాల్గొన్న ఆరుగురు ఆర్థికవేత్తలు వృద్ధి రేటు తగ్గుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు సంస్థలు జనవరి-మార్చి మధ్య జీడీపీ తగ్గుతుందని చెబుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదించుకుపోతోందని సింగపూర్ క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన ఇండియా సీనియర్ ఎకనమిస్ట్ షిలన్ షా తెలిపారు. సుధీర్ఘ లాక్‌డౌన్ ఆంక్షలతో పాటు పరిమిత ప్యాకేజీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు దశాబ్దాల తర్వాత భారీగా కుంచించుకుపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోల్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై స్పందిస్తూ..ఈ ప్యాకేజీ క్రెడిట్ లభ్యతను పెంచుతుందని, సమీపకాలంలో డిమాండ్ సృష్టించే కంటే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందని చెప్పారు.

Next Story

Most Viewed