కరోనా వ్యాప్తి వేగం.. ప్రపంచంలో, భారత్ లో ఇలా..!

by  |
కరోనా వ్యాప్తి వేగం.. ప్రపంచంలో, భారత్ లో ఇలా..!
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని చుట్టేసింది. ఇటలీ, స్పెయిన్, అమెరికాలలో ఈ వైరస్ దావానలంలా వ్యాపించింది. కొన్ని దేశాలు వైరస్ విస్తరణ వేగానికి అడ్డుకట్ట వేసినా మరికొన్ని దేశాలు మాత్రం దాని ధాటికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి. భారత్ లో దాదాపు 2 నెలల క్రితం ప్రవేశించినా దాని వ్యాప్తి మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగానే ఉన్నది.

భారత్ లో గత వారం రోజులుగా కేసులు వేగంగా పెరుగుతున్నా.. వైరస్ వ్యాప్తి వేగం మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే స్వల్పంగానే ఉంది. మార్చి 19న ఒక కరోనా పాజిటివ్ బాధితుడు ఇతరులకు వ్యాపించే రేటు 1.7 గా ఉన్నది. అంటే ఒకరు 1.7 మందికి, మరో విధంగా చెప్పాలంటే పదిమంది కరోనా బాధితుల నుంచి 17 మందికి సోకుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. మార్చి 26 నాటికి ఈ రేటు 1.8గా ఉన్నది. ఇటలీ,స్పెయిన్ లతో పోల్చుకుంటే ఇది అతి స్వల్పంగా ఉన్నట్టు చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాప్తి రేటు రెండు నుంచి మూడుగా ఉంది. భారత్ లోని వ్యాప్తి రేటుతో ఈ నెల మొదటి వారానికి కరోనా కేసుల సంఖ్య 3,000లకు చేరవచ్చని లేదా అసాధారణ పరిస్థితుల్లో 5 వేలకు పెరగొచ్చని నిపుణులు అంచనా వేశారు.

నెల రోజుల్లో ఆ ఆరు దేశాల్లో వైరస్ తీరు..

ఇతర దేశాల్లో వైరస్ వ్యాప్తి వేగం కంటే మనదేశంలో స్వల్పంగా ఉంది. ఇటలీ, ఇరాన్, సౌత్ కొరియా, స్పెయిన్ ల కంటే మనదే మెరుగ్గా ఉంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య మూడు నుంచి వెయ్యికి చేరడానికి నెల రోజులు పట్టింది. ఇటలీలో నెల వ్యవధిలోనే 47 వేల కేసులు నమోదయ్యాయి. ఇరాన్లో 18వేలు, సౌత్ కొరియాలో 1,700కు చేరింది. సింగపూర్ మాత్రం వందలోపే కేసులు నమోదయ్యాయి.

వారం వారీగా చూస్తే..

భారత్ లో వారాల వారీగా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే..

మొదటి వారంలో మూడు నుంచి 43కు కేసులు పెరిగాయి. 43 నుంచి 114.. తర్వాత 415కు.. మరో వారానికి (29వ రోజుకు) 1071కు కరోనా కేసులు చేరాయి. దక్షిణ కొరియాలో ఈ కేసులు వారాల వారీగా.. 4 నుంచి 23కి, 23 నుంచి 28కి, 28 నుంచి 104కి, 104 నుంచి 1,766కు పెరిగాయి.

సింగపూర్ లో 4 నుంచి 18, 18 నుంచి 43, 43 నుంచి 75, 75 నుంచి 90కు పెరిగాయి. స్పెయిన్ లో 2 నుంచి 151కి, 151 నుంచి 1,639కి, తర్వాత వారంలో 11,178కి, నెక్స్ట్ వీక్ లో 39,673కి చేరాయి. తర్వాత ఒక్క రోజులోనే 47,000లకు పెరిగాయి.

ఇటలీలో వారాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి వారంలో 3 నుంచి 650, 650 నుంచి 3,858, 3,858 నుంచి 15,113, 15,113 నుంచి 41,035కు చేరాయి. తర్వాత ఒక్క రోజులోనే కేసులు 47,021కు పెరిగాయి. ఇరాన్ లో వారాల వారీగా కరోనా వ్యాప్తిని చూస్తే.. 2 నుంచి 141, తర్వాత వారంలో 2,922, అటు తర్వాత వారంలో 9,000 కు.. నెక్స్ట్ వీక్ లో 17,361కి చేరాయి. ఈ వివరాల ప్రకారం భారత్ లో కోవిడ్ 19 వ్యాప్తి.. ప్రపంచవ్యాప్త విస్తరణ రేటు కన్నా తక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, మన దేశంలో కరోనా టెస్టులు విస్తృతంగా చేపట్టట్లేదన్న విమర్శలూ ఉన్నాయి. అయితే వైరస్ వ్యాప్తి మాత్రమే కాదు మరణాలు కూడా తక్కువగానే చోటుచేసుకుంటున్నాయి.

Tags: Coronavirus, speed, rate, transmission, cases, deaths

Next Story

Most Viewed