తూర్పు నౌకాదళం కరోనాను కట్టడి చేస్తోందిలా..!

by  |
తూర్పు నౌకాదళం కరోనాను కట్టడి చేస్తోందిలా..!
X

సినిమాల్లో హీరోలు క్లైమాక్స్‌లో తనపై ఆధారపడిన వారిని టచ్ చేయాలంటే.. తనను దాటి టచ్ చేయాలని సవాల్ చేయడం చూసే ఉంటాం.. కానీ ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ను వైజాగ్ దరి చేరనీయకుండా తూర్పు తీర నౌకాదళం కూడా తనను దాటి వైజాగ్‌లో అడుగుపెట్టాలని కరోనాకు సవాల్ విసురుతోంది. భూ, విమాన మార్గంలో కరోనా వైజాగ్ చేరితే నేవీకి సంబంధం లేదు కానీ… సముద్ర మార్గాన తూర్పు తీర నౌకదళాన్ని దాటి వైరస్ వైజాగ్ చేరడం మాత్రం కష్టమే.

కరోనా వైరస్ ప్రస్తుతం 162 దేశాలకు వ్యాపించింది. 8 వేల మందికిపైగా దాని కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి సముద్రమార్గాన రక్షణ కల్పించే తూర్పుతీర నావికాదళం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి ప్రధానంగా కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే నౌకలను వైజాగ్‌లోనికి నేరుగా అనుమతించడం లేదు. విశాఖపట్టణానికి పది నాటికల్ మైళ్ల దూరంలోనే బంగాళాఖాతంలో ఆ నౌకలను ఆపేసి తనిఖీలు చేపడుతోంది.

ఆ షిప్‌లోని మాస్టర్‌ (కెప్టెన్) ను రప్పించుకుని, ప్రతి ఒక్కరి ఆరోగ్య నివేదిక తెప్పించుకున్న తరువాత.. ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే నౌకాశ్రయంలోని జెట్టీల వద్దకు అనుమతిస్తున్నారు. అది కూడా ఆ నౌక ఆ దేశం నుంచి బయల్దేరి 14 రోజులు పూర్తయితేనే.. ఎందుకంటే కరోనా లక్షణాలు అది సోకిన 14 రోజులలోపు బయటపడతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నౌక బయల్దేరి 14 రోజులు పూర్తయితే వారిని అనుమతిస్తున్నారు. లేని పక్షంలో అక్కడే ఆ 14 రోజులు పూర్తయ్యేందుకు వేచి చూడమంటున్నారు.

ఈ లోపు కరోనా లక్షణాలు ఎవరికైనా కనబడితే ఆ నౌకను అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో సముద్ర మార్గాన కరోనా వైరస్‌ వైజాగ్ చేరడం అసాధ్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళ హెడ్ క్వార్టర్స్ వైజాగ్‌లో ఉన్న నేపథ్యంలో నేవీ సిబ్బంది ప్రధానంగా వైజాగ్‌లో నివాసముంటారు. ఏ ఒక్కరికి కరోనా సోకినా నేవీ సిబ్బంది మొత్తం ప్రభావితమయ్యే ప్రమాదముంది. పొరపాటున కరోనా సోకిన వ్యక్తి షిప్‌లో గస్తీకి వెళ్తే.. షిప్‌లోని నేవీ సిబ్బంది మొత్తానికి వ్యాపించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే నేవీ ఈ చర్యలు చేపట్టింది.

Tags: indian navy, naval camond, naval base, visakhapatanam, eastrn naval camond, carona virus, covid-19

Next Story

Most Viewed