కోహ్లీ సేన నిరాశపరిస్తే ఏం.. అమ్మాయిలు అదరగొట్టారు

by  |
కోహ్లీ సేన నిరాశపరిస్తే ఏం.. అమ్మాయిలు అదరగొట్టారు
X

న్యూజిలాండ్ గడ్డపై గెలిచేందుకు టీమిండియా ఆపసోపాలు పడుతోంది. ఆరంభశూరత్వం చూపిన టీమిండియా వన్డేల్లో క్లీన్ స్వీప్ అయింది. టెస్టుల్లో క్లీన్ స్వీప్‌కు సిద్ధంగా ఉంది. కోహ్లీ సేన ప్రదర్శనపట్ల సగటు అభిమాని తీవ్ర నిరాశలో మునిగిన వేళ.. కోహ్లీ సేన నిరాశపరిస్తే ఏం? మేమున్నాము కదా అంటూ భారత మహిళా క్రికెటర్లు భరోసా ఇస్తున్నారు. టైటిల్ ఫేవరేట్ జట్లను మట్టికరిపిస్తూ సెమీఫైనల్ చేరారు.

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అమ్మాయిలు వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా అదరగొట్టే ప్రదర్శనతో విజయం సాధించారు. మెల్‌బోర్న్‌ వేదికగా కివీస్ జట్టుతో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా అమ్మాయిలకి షెఫాలీ వర్మ మరోసారి శుభారంభాన్నిచ్చింది. 34 బంతుల్లో నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసింది. భారీ షాట్‌కు యత్నించి కెర్‌కు క్యాచ్ ఇచ్చింది. స్టార్ ఓపెనర్ బ్యాటర్ స్మృతి మందన (11) ధాటిగా ఆడే క్రమంలో ఔటైంది. దీంతో జతకలిసిన తానియా భాటియా (23) ఆకట్టుకుంది. అనంతరం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (10) నిరాపర్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (1) మరోసారి దారుణంగా విఫలమైంది. దీప్తి శర్మ(8), వేద కృష్ణమూర్తి (6), రాధా యాదవ్ (10), శిఖా పాండే (10) పర్లేదనిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత జట్టు 133 పరుగులు చేసింది.

134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌ జట్టు ధాటిగా ఆడింది. దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ కట్టుదిట్టమైన బంతులేసి తలో వికెట్ తీసినప్పటికీ కివీస్ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. ప్రీస్ట్ (12), డివైన్ (14), బేట్స్ (6) విఫలమయ్యారు. గ్రీన్ (24), మార్టిన్ (25) రాణించారు. చివర్లో కెర్ (34) 6 బౌండరీలతో మెరుపులు మెరిపించినప్పటికీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 129 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో నాలుగు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌‌గా షెఫాలీ వర్మ నిలిచింది. హ్యాట్రిక్ విజయంతో భారత మహిళా జట్టు సెమీఫైనల్‌లో చేరింది. కివీస్, ఆసీస్ మ్యాచ్ విజేత ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్స్‌లో ఆడనుంది.

Next Story

Most Viewed