మూడు నెలల పాటు 'లాక్‌డౌన్' ?

by  |
మూడు నెలల పాటు లాక్‌డౌన్ ?
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ‘లాక్‌డౌన్’ మూడు నెలల పాటు కొనసాగనుందా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. తొలుత ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో 14 గంటల వరకే అని మొదలైంది. ఇప్పుడు అది ‘లాక్‌డౌన్’ పేరుతో 21 రోజుల వరకు కంటిన్యూ అవుతోంది. కొన్ని చోట్ల ‘లాక్‌డౌన్’గా మరికొన్ని చోట్ల ‘నైట్ కర్ఫ్యూ’గా కొనసాగుతోంది. ఇంకెన్ని రోజులుంటుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. తెలంగాణ ప్రభుత్వం నెల రోజులకు సరిపడా రేషన్ సమకూరుస్తూ ఉంటే కేంద్రం మాత్రం మూడు నెలల పాటు అందించనుంది. ఇక కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మాత్రం ఆరు నెలలకు సరిపడా రేషను బియ్యాన్ని తీసుకోవచ్చంటూ రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది.

ఇన్ని రకాల వార్తలు వినిపిస్తున్నందున ఈ ‘లాక్‌డౌన్’ 21 రోజులకే పరిమితం కాదని, ఇంకా మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చేశారు ప్రజలు. ఉపాధి కోల్పోయి, జీతాల్లేక, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, రోడ్లమీదకు వెళ్ళడానికి సవాలక్ష ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో దాదాపు జూన్ చివరి వరకూ ఇదే పరిస్థితులు తప్పవనే మైండ్‌సెట్‌కు వచ్చేశారు. ఇక రానున్న మూడు నెలల పాటు ఎలా గడపడమా అనే ఆలోచనల్లో పడ్డారు. ప్రైవేటు చిరుద్యోగుల్లో ఈ ఆందోళన ఇంకో రకంగా ఉంది. ఈ నెలాఖరు వరకు అంటే ఓకే అని తొలుత సరిపెట్టుకున్నారు. ప్రధాని 21 రోజుల పాటు అనగానే వారిలో ఆందోళన మొదలైంది. మరో మూడు నెలలపాటు అనే వార్తలు వస్తుండడంతో ఆ ఆందోళన మరింత పెరిగింది.

ప్రైవేటు ఉద్యోగికి తన ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే భయం పట్టుకుంది. ఒకవేళ ఈ ఉద్యోగం ఊడిపోతే కొత్తదాన్ని వెతుక్కోవడం ఎలా అనే గందరగోళ పరిస్థితులు చాలా మంది యువకుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఇంటి అద్దెలు, నెలవారీ ఖర్చులు, పిల్లల చదువులు… ఇలా ఒకదాని వెంట ఒకటి వారికి చెమటలు పట్టిస్తున్నాయి. నిజంగా ఇప్పుడు కొనసాగుతున్న ‘లాక్‌డౌన్’ మూడు నెలల పాటు కంటిన్యూ అవుతుందా? ఈ సందేహానికి ఇప్పుడు సమాధానం చెప్పేవారెవ్వరూ లేరు. నిర్మలా సీతారామన్ మూడు నెలల పాటు రేషను సరుకులను సమకూరుస్తున్నారు. ఆర్థిక సంవత్సరం లెక్కలను జూన్ వరకూ ప్రభుత్వం వాయిదా వేసింది. విద్యా సంస్థలకు ఎలాగూ జూన్ వరకూ సెలవులే. ఇవన్నీ ఒకదాన్ని మరొకదానితో పోల్చి చూసుకుంటున్న ప్రజలకు దాదాపు జూన్ చివరి వరకూ కరోనా ఆంక్షలు కొనసాగక తప్పదన్న అంచనా వచ్చేసింది.

కరోనా ‘లాక్‌డౌన్’ కారణంగా నష్టపోతున్న పేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలాసార్లు ‘మూడు నెలలు’ అనే పదాలను ఉచ్ఛరించారు. ఇలా పదేపదే ఆ పదాలను పలకడంతో మీడియా ప్రతినిధులకు సైతం అనేక సందేహాలు వచ్చాయి. వాటి గురించి ప్రస్తావించడానికి సైతం ఆమె అవకాశం ఇవ్వడంలేదు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. రైలు సర్వీసులన్నీ తొలుత ఈ నెల 31 వరకు మాత్రమే నిలిపివేస్తున్నట్లు చెప్పిన రైల్వే మంత్రిత్వశాఖ ప్రధాని ‘లాక్‌డౌన్’ అనంతరం వచ్చే నెల 14వ తేదీ వరకు నిలిపివేయక తప్పలేదు. దీంతో అత్యవసర పరిస్థితులే ఏర్పడితే కొన్ని రైలు కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా వాడుకునే వెసులుబాటుపై రైల్వే బోర్డు ఛైర్మన్ సంబంధిత అధికారులతో చర్చించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.

ఇలా ఒక్కో విభాగం వరుసగా వాటివాటి పరిధిలో ప్రత్యామ్నాయాల గురించి అధికారుల స్థాయిలో చర్చలు జరుపుతుండడంతో ప్రస్తుత ‘లాక్‌డౌన్’ పరిస్థితి మరికొంత కాలం కొనసాగడం తథ్యమనే సంకేతాలిచ్చినట్లయింది. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ‘లాక్‌డౌన్’పై వెలువడే ప్రకటన ఇలాంటి సందేహాలను నివృత్తి చేస్తుంది.



Next Story

Most Viewed