సర్పంచుల ఐదేళ్ళ కాలం వీటికే సరిపోయేది

by  |
సర్పంచుల ఐదేళ్ళ కాలం వీటికే సరిపోయేది
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : తెలంగాణ వ‌స్తే ఏమొస్త‌ద‌నే వాళ్ళ‌కు నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాక్షాత్కరిస్తుందని, అందుకు ప‌ల్లెలే ప్ర‌త్య‌క్ష సాక్ష్యాల‌ని, రాష్ట్ర ఆవిర్భావంతో ప‌ల్లెలు ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తున్నాయ‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా క‌లెక్టరేట్ లో జాతీయ జెండాను వారు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్ర ప్రగతిని చూసి అనేక రాష్ట్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పథకాలను వారు అనుసరించే స్థాయికి వచ్చాయన్నారు. ముఖ్యంగా గ్రామాల రూపు రేఖ‌లే మారిపోయాయ‌న్నారు. ఒక‌ప్పుడు గ్రామాల్లో మంచినీటిని, విద్యుత్ ని స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మే క‌ష్టంగా ఉండేద‌న్నారు. సర్పంచ్ ల ఐదేళ్ళ కాలం వీటికే స‌రిపోయేది కాద‌న్నారు. కానీ, నేటి ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంద‌న్నారు. అన్ని గ్రామాల్లో అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతున్నద‌ని చెప్పారు. గ్రామాల్లో నిరంత‌రాయంగా 24 గంట‌ల‌పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా, ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఆరోగ్య‌క‌ర‌మైన, శుద్ధి చేసిన మంచినీరు అందుతుంద‌న్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కొత్త భవనాలు, అంతర్గత రోడ్లు, చెత్త‌ను వేరు చేసే డంపు యార్డులు, ఇంకుడు గుంత‌లు, వ‌ర్ష‌పు నీటి సంర‌క్ష‌ణ‌, వైకుంఠ దామాలు, ప్ర‌కృతి వ‌నాలు, న‌ర్స‌రీలు, హ‌రిత హారాలు, ఉపాధి హామీ కింద అనేక ర‌కాల ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయ‌న్నారు.

ఇవేగాక రైతుల‌కు రైతు వేదిక‌లు, క‌ల్లాలు వంటి మ‌రెన్నో ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయ‌ని చెప్పారు. ఇవేగాక ప‌ల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.339 కోట్లు విడుద‌ల చేయడం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. గ్రామ పంచాయ‌తీల‌కు ట్రాక్ట‌ర్లు, ఇంకా నిధులు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్ కు అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల వేడుకలు నిరాడంబరంగా జరిగాయని అన్నారు.



Next Story

Most Viewed