దోమకొండలో డేంజర్ బెల్స్.. పెరుగుతున్న డెంగ్యూ కేసులు

by  |
దోమకొండలో డేంజర్ బెల్స్.. పెరుగుతున్న డెంగ్యూ కేసులు
X

దిశ, దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు డేంజర్ స్థాయికి చేరుకుంటున్నాయి. వారం రోజుల్లోనే కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావ‌డంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇన్నాళ్ళు కరోనా కలకలంతో ఇబ్బందులకు గురైన ప్రజలు ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్‌తో వణికిపోతున్నారు.

దీనికితోడు వైరల్ ఫీవర్‌లు అధికంగానే నమోదవుతున్నాయి. మండలంలో చిన్న ఆస్పత్రి నుంచి పెద్దాస్పత్రి వరకు కూడా ఎందులో చూసినా ప్రజలకు బెడ్లు ఖాళీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రికి వెళితే పరీక్షల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. దోమకొండలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా.. సరైన సౌకర్యాలు లేక ప్రజలు కామారెడ్డి వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లి అధిక డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. ఇక వైద్యులు కూడా ఇదే అదునుగా చేసుకుని పరీక్షల పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగేస్తున్నారు.

గ్రామాల్లో దోమలను పారద్రోలడానికి రసాయన మందు కూడా చల్లడం లేదు. ఈ ప్రభావంతో దోమల బెడద ఎక్కువ అవుతున్నది. గ్రామాల్లో వైరల్ జ్వరాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే వారిలో జలుబు, దగ్గు, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి వాటితో రోజుకు 50 నుంచి 100 మంది ఒక్కొక్క ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇటీవల కురిసిన ముసురు వానల వల్ల దోమలు, ఈగల బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed