2 రోజులే గడువు.. దొరకని ముహూర్తం

by  |
2 రోజులే గడువు.. దొరకని ముహూర్తం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 104 వేదికలను గాను ఈ నెల 8వ తేదీ వరకే మొత్తం నిర్మాణాలను యంత్రాంగం పూర్తి చేసింది. అలాగే నిజామాబాద్ జిల్లాలో 106 రైతు వేదికలకు గాను 70 మాత్రమే పూర్తికాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. దసరా నాటికే పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. తాజాగా నెలాఖరుకు గడువు ఇచ్చినా పూర్తి కావడానికి సమయం పట్టేటట్లు ఉంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 104 రైతు వేదిక భవనాలు నిర్మించి రాష్ట్రంలో కామారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.

నిర్మాణ పనుల విషయంలో దాతల సహాయం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతు వేదికల నిర్మాణానికి సొంత డబ్బులు ఖర్చు చేశారు. పలువురు అదే బాటలో నడుస్తున్నారు. అన్ని రైతు వేదికలకు విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా యంత్రాంగం పురమాయించింది. అలాగే రైతు వేదికల క్లస్టర్ల పరిధిలో రైతు కళ్లాల నిర్మాణ పనులను ఈజీఎస్ నిధులతో చేపడుతున్నారు. అయితే పూర్తయిన వేదికలను ప్రారంభించేందుకు పాలకులకు సరైన ముహూర్తం దొరకడం లేదని ఆరోపణలున్నాయి. త్వరితగతిన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

రైతు వేదికల నిర్మాణాల్లో నిర్మల్ జిల్లా మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దసరా నాటికే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. అయితే గడువు రెండు రోజులే ఉండడం, ఇంకా పనులు కొనసాగుతుండడంతో నిర్మాణాలు పూర్తయ్యేలా లేవు. నిర్మల్ జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా 79 చోట్ల రైతు వేదికల నిర్మాణాలను చేపట్టారు. గురువారం సాయంత్రం వరకు 69 పూర్తి కాగా ఇంకా 10 చోట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. వీటిని దసరాలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పింది. ఇటీవల ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చినా పూర్తయ్యేలా లేదు.

నెమ్మదిగా కొనసాగుతున్న పనులను పూర్తి చేయించేందుకు జిల్లా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. 17 మండలాల్లో వేదికలు పూర్తి కాగా, తానూర్, ఖానాపూర్ మండలాల్లో కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. రైతు వేదికల నిర్మాణ విషయంలో నిర్మల్ జిల్లా తెలంగాణ లో రెండో స్థానంలో ఉం దని అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం జోహార్ పూర్ క్లస్టర్ లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాన్ని కలెక్టర్ వారం రోజుల్లో మూడుసార్లు సందర్శించారంటే అధికారులపై ఒత్తిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆయా క్లస్టర్లలో స్థానిక ప్రజా ప్రతినిధులు నిర్మాణ పనులు చేపట్టిన కొన్ని చోట్ల ఇంకా పనులు కొనసాగుతూనే ఉండగా… కాంట్రాక్టర్లు చేపట్టిన చోట పనులు పూర్తి అయినట్లు సమాచారం.

Next Story

Most Viewed