పెళ్లిని కమ్మేసిన కరోనా..

by  |
function halls
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెళ్లంటే నూరేళ్ల పంట.. ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే.. మాములు సందడి ఉండదు. బంధుమిత్రుల కలయికతో సందడిగా ఉంటుంది. వారి వారి స్థోమతను బట్టి పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. పెళ్లంటే కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగే తంతు మాత్రమే కాదు. వివాహం కొంత మందికి బతుకుదెరువు. ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తోంది. ఫంక్షన్ హాల్స్, వంటమాస్టర్, డెకరేషన్స్, ఫొటో, వీడియో గ్రాఫర్స్, వస్త్ర, బంగారు, కిరాణ దుకాణాలు ఇలా అన్ని కిటకిటలాడుతుంటాయి. వివాహం జరిగే ఇళ్లు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతుంటుంది. పిండి వంటలు, ఇతర రకాల వంటలతో ఘుమఘుమలాడుతుంటాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ కనిపించడం లేదు. లాక్ డౌన్‌తో ఎన్నో వివాహ ముహుర్తాలు అటకెక్కాయి. కళ్యాణ మంటపాలు బోసిపోయి వెలవెలబోతున్నాయి. దీనిపై ఆధారపడి జీవనం సాగించే వారి పరిస్థితి దయనీయంగా మారింది.

కరోనా, లాక్‌డౌన్ ఫలితంగా ఎన్నో వివాహాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు అంటే.. సుమారు రెండు నెలల పాటు ఫుల్ బిజీగా ఉండవచ్చని భావించారు. ఈ సంవత్సరమైనా మంచి గిరాకీ వస్తుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. పెళ్లిళ్ల సందర్భంగా కొనుగోలు చేసే బట్టలు, బంగారు ఆభరణాలు, ఫర్నీచర్, స్టీల్ సామాగ్రి, పత్రికల షాపులు, ప్రింటింగ్ ప్రెస్ తదితర వస్తువులు కొనుగోలు చేయకపోవడంతో దీనిపై ఆధారపడిన వ్యాపారులు తీరని నష్టాన్ని చవి చూస్తున్నారు. బాజా భజంత్రీలు వాయించే కళాకారులు, బ్యాండ్ మేళాల్లో పని చేసే వారిలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. డెకరేషన్ చేసే వారితో ఫొటో, వీడియోగ్రాఫర్లది ఇదే పరిస్థితి. క్యాటరింగ్ చేసే నిర్వహకులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఘుమఘుమలాడుతూ వంటలు చేస్తే వారికి ఆర్డర్లు లేక పోవడంతో చతికిలపడ్డారు.

function halls2

కళ తప్పిన ఫంక్షన్ హాల్స్

ప్రస్తుతం మండల కేంద్రాల్లో కూడా ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. ఇక నగరంలో పెద్ద పెద్ద హోటళ్లలో, ఫంక్షన్ హాల్స్ లో భారీగా వివాహాలు జరుగుతుంటాయి. లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుండేది. పేరొందిన ఫంక్షన్ హాల్స్‌లో నెల, రెండు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం ఇవన్నీ కళ తప్పాయి. బోసిపోయి పోతున్నాయి. గతంలో ఒక్కో ఫంక్షన్ హాల్ లో రోజుకు రెండు.. మూడు పెళ్లిళ్లు జరిపించేందుకు ఒప్పుకునే పరిస్థితి ఉండేది. కరోనాతో ఇప్పడు రివర్స్ అయింది. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే వచ్చే ఆదాయని బ్రేక్ పడిందని ఫంక్షన్ హాల్స్ యజమానులు వాపోతున్నారు. దీనిపై ఆధారపడిన వారి పరిస్థితి ఆగమ్యగోచరం తయారైంది.

పూల అమ్మకానికే పరిమితం

ఫ్లవర్ డెకరేషన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి ఒకప్పుడు వేసవివచ్చిందంటే శుభాకార్యాలయాలు జరిగేవి. వారికి తీరిక ఉండేదికాదు. తడకల పందిరి, మంగళస్నానం, పెళ్లిపందిరి, పెళ్లికొడుకు సంబురం, రిసెప్షన్ తదితరాలకు డెకరేషన్ చేసేవారు. నేడు అందుకు భిన్నంగా మారింది. కరోనాతో శుభకార్యాలయాలు చేసేవారికి ప్రభుత్వం నిబంధనలు విధించడం, వారు సైతం హంగుఆర్భాటాలకు వెళ్లకుండా తక్కువ ఖర్చుతో చేస్తుండటంతో వీరికి పనులు లేకుండా పోయింది. పొట్టకూటి కోసం పూలు అమ్ముతూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.

తీవ్రంగా నష్టపోయాం

Rammohan

కరోనాతో ఫంక్షన్‌‌‌‌ హాల్స్ మూసివేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. వేసవి సెలవుల్లో పెండ్లిళ్లకు ముహూర్తాలు ఉండటంతో అనేక ఫంక్షన్ హాల్స్ ముందస్తుగా బుకింగ్‌‌ ‌‌అయ్యాయి. లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయాం. మే నెల దాటితే మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పనిచేసే కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నిర్వహణ భారంగా మారింది.
-సింగం రామ్మోహన్, నిర్వహకుడు ఎస్‌బీఆర్ ఫంక్షన్ హాల్

ఇబ్బందులు పడుతున్నాం

Ravi kumar

ఏడాదికి ఏప్రిల్, మే రెండు నెలలు మాత్రమే క్యాటరింగ్ పని దొరుకుతుంది. అయితే గతేడాది నుంచి కరోనాతో ఉపాధి కోల్పోయాం. నాతో పాటు మరో 10 మంది పనిచేస్తారు. పనిలేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను నమ్ముకున్నవారికి ఉపాధి చూపించలేకపోతున్నాన్న బాధ కలుగుతోంది.
-పొగాకు రవి కుమార్, రవిక్యాటరింగ్ నిర్వహకుడు

ప్రభుత్వమే ఆదుకోవాలి

Muchrla Ravi Kumar

గత 12 ఏళ్లుగా ఫొటో గ్రాఫర్ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నా. పెండ్లిల సీజన్ వస్తే నలుగురికి ఉపాధి చూపించేవాడ్ని. కానీ కరోనాతో ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. అప్పులు చేసి వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కెమెరాలతో వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రూ.2లక్షలు వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. లేకుంటే అప్పులు కట్టలేక వృత్తికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
– ముశ్చర్ల విజయ్ కుమార్, సీనియర్ ఫొటో గ్రాఫర్, స్నేహ ఫొటో స్టూడియో

కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు

Ramu

ఫ్లవర్ డెకరేషన్ పనిచేసేందుకు నాతో పాటు మరో నాలుగురం పనిచేస్తాం. వేసవికాలం వచ్చిందంటే శుభకార్యాలయాలు ఎక్కువగా సారిగేది. తీరిక లేకుంటే ఉండేది. ఆర్డర్లు ఎక్కువగా వచ్చేది. అందరికీ కూలీ గిట్టుబాటు అయ్యేది. కానీ ప్రస్తుతం శుభాకార్యాలయాలు లేక పోవడంతో పూలు అమ్ముకుంటే వాటిని కొనేవారు కూడా తగ్గడంతో రోజుకూలీ రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు.
-దొడ్డరాము, నిర్వహకుడు, రుద్ర ఈవెంట్స్ అండ్ ప్లవర్ డెకరేషన్

Next Story