ఊహాజనిత సోషలిజం నిర్మించలేం : తమ్మినేని

by  |
Thammineni veerabhadram
X

దిశ, తెలంగాణ బ్యూరో : సోషలిజం నిర్మించే పద్ధతులపై గందరగోళం ఉందని, ఊహాజనిత సోషలిజాన్ని నిర్మించలేమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని బసవపున్నయ్య 29వ వర్ధంతి సభను సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు అధ్యక్షత వహించిన ఈ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.

అంతర్జాతీయ, జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సైద్ధాంతిక స్పష్టత అవసరమన్నారు. భౌతికంగా వర్గపోరాటాలు పెద్దఎత్తున సాగించే పరిస్థితి లేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు చరిత్రలో వచ్చినపుడు వాటిని ఎదుర్కొనే సైద్ధాంతిక స్థైర్యం ఉండాలని సూచించారు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకటించిన నాటినుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆటంకాలు ఎదురైనపుడు సైద్ధాంతికంగా స్పష్టత లేనపుడే కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతిన్నదని వివరించారు. ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్‌ వ్యాప్తితోపాటు మానవాళి ఎదుర్కొనే సమస్యలను పెట్టుబడిదారీ విధానం పరిష్కరించలేదని అన్నారు. ఏ సమస్యనైనా సైద్ధాంతికంగా పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, జి.రాములు, బి.వెంకట్‌, టి.జ్యోతి, పోతినేని సుదర్శన్‌, మిడియం బాబురావు, ఎం సాయిబాబు, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ కమ్యూనిస్టు కుంజా బొజ్జి

Kunja bujji

సీపీఎం మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జి మరణం బాధాకరమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎంబీ భవన్‌లో కుంజా బొజ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నివాళ్లర్పించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య మాట్లాడుతూ పాలకవర్గాల ఒత్తిళ్లకు, బేరసారాలకు అవకాశాలివ్వకుండా పార్టీ కోసం బొజ్జి నిక్కచ్చిగా నిలబడ్డారని అన్నారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం అధ్యయనం చేశారని, ప్రజాప్రతినిధిగా ఉంటూనే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. సమాజంలో విలువలు అడుగంటిపోతున్న ఈ సమయంలో విలువలకు ప్రతినిధిగా కుంజా బొజ్జి ఉన్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆయన పార్టీకందించిన సేవలను గుర్తు చేసుకుున్నారు.

Next Story

Most Viewed