తెరవెనుక మంత్రి అనుచరులు?.. మొత్తం రూ.100 కోట్లు

by  |
తెరవెనుక మంత్రి అనుచరులు?.. మొత్తం రూ.100 కోట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడా సాదా బయనామా కింద మ్యూటేషన్లు చేయడానికి వీలు లేదు. అందుకు కఠిన నిబంధనలే ఉన్నాయి. పైరవీకారులకు, పలుకుబడి ఉన్నవారికి మాత్రం ఆ నిబం ధనలు ఏవీ అడ్డు రావడం లేదు. కోర్టు కేసులు ఉన్నా పట్టించుకోవడం లేదు. పట్టాదారులు అందుబాటులో లేని విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు వాళ్ల భూములను కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారు. వారికి అధికారులు సహకరిస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలోనే డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు రికార్డులు కూడా చూసుకోకపోతే ఎవరి భూమినైనా హస్తగతం చేసుకునేందుకు కుట్రలు పన్నేవారున్నారని ఓ భూదందా స్పష్టం చేస్తోంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అంతాయిపల్లి (తూంకుంట మున్సిపాలిటీ పరి ధి) లో ఇలాగే రూ.100 కోట్లకు పైగా విలువ జేసే భూమిని కొందరు నకిలీ సాదా బయనామాతో కైవసం చేసుకునేందుకు యత్నించారు. వీరు అధికార పార్టీకి చెందిన రియల్టర్లని, ఓ మంత్రికి అత్యంత సన్నిహితులనీ ప్రచారం జరుగుతోంది. అందుకే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది వారికి సహకరించి పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని తెలిసింది. అమెరికాలో ఉండే అసలు పట్టాదారులు అప్రమత్తం కావడంతో దందాకు బ్రేకులు పడ్డాయి. వారు సకాలంలో అధికారులకు ఫిర్యాదు చేయడంతో సేల్ డీడ్లు రద్దు చేసుకున్నారు. పాస్ పుస్తకా లు మాత్రం ఇంకా రద్దు కాలేదు. ఈ తతంగమంతా తెలిసినా అధికారులు, సిబ్బందిపై కలెక్టర్, సీసీఎల్ఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్లరికల్ మిస్టేక్ గా అభివర్ణిస్తూ చేతులు దులిపేసుకున్నా రు. కీసర తహశీల్దార్ నాగరాజు వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడి పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దందాలో అధికార పార్టీకి చెందిన నాయకులు పరోక్ష పాత్రను పోషించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం బయటపడడంతో క్లరికల్ మిస్టేక్ అంటూ సింపుల్ గా చెప్పి తప్పించుకుంటున్నారు.

అసలు కథ ఏమిటంటే

శామీర్ పేట మండలం అంతాయిపల్లికి చెందిన మాగం దేవేందర్ రెడ్డికి వారసత్వంగా సర్వే నం.103లో 7.32 ఎకరాల భూమి వచ్చింది. ఆయన తన తమ్ముడి దగ్గర అదే సర్వే నంబరులో మరో నాలుగు ఎకరాలు భార్య భారతలక్ష్మి పేరిట కొనుగోలు చేశారు. దంపతులిద్దరికీ కలిసి 11.32 ఎకరాల భూమి ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి పట్టాదారు పుస్తకాలు కూడా ఉన్నాయి. పట్టాదారులు అమెరికాలో ఉన్న కాలంలో ఇక్కడ కొందరు రంగంలోకి దిగారు. నకిలీ సాదా బయనామా సృష్టించి అదే సర్వే నంబరులోని సదరు ఖరీదైన భూమిని కలుపుకొని 13.26 ఎకరాలను కల్పిత పేర్లతో ఆర్వోఆర్ యాక్ట్ 5 ఏలో క్రమబద్ధీకరించుకున్నారు. అధికారులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పొద్దుటూరు విజయలక్ష్మి (84) భర్త నర్సిరెడ్డి పేరిట పట్టాదారు పుస్తకాన్ని కూడా జారీ చేశారు. ఈ భూమికి 103/ట/ఆ/2 అనే సబ్ నంబరును కూడా కేటాయించారు. అసలు పట్టాదార్లకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎలాంటి విచారణా చేపట్టలేదు. సాదా బయనామా ఎంత వరకు నిజమన్న విషయాన్నీ రూఢీ చేసుకోలేదు. వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉండడంతో చకచకా పనులు చేశారు. ఇదంతా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. మామూలు జనం అయితే నెలల తరబడి తిరగాల్సి ఉంటుంది.

ఆ తరువాత ఏం జరిగింది

నకిలీ సాదా బయనామాలతో పాస్ పుస్తకాలు పొందిన విజయలక్ష్మి నుంచి జూలై నెలలో రూ.42 లక్షలు చెల్లించి ఏడెకరాలను టీఆర్ఎస్ నేత సదా నర్సింహారెడ్డి కొడుకు అనుదీప్ రెడ్డి (29) కొనుగోలు చేశారు. మరో సేల్ డీడ్ ద్వారా రూ.39.90 లక్షలు ఇచ్చి 6.26 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తంగా ఆమెకు రూ.81.90 లక్షలు చెల్లించారు. ఇదంతా రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే. బహిరంగ మార్కెట్ లో ఎకరా రూ. 10 కోట్లకు పైగానే పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తెర వెనుక పెద్దలు నడిపిన యంత్రాంగంతో పాస్ పుస్తకాలు పొందడంలో విజయలక్ష్మి సక్సెస్ అయ్యారు. వెంటనే భూమిని విక్రయించారు. ఆ తరువాత అనుదీప్ రెడ్డి కొనుగోలు చేశారు. ఐదు రోజుల్లోనే ప్రక్రియ పూర్తయ్యింది. సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ సేల్ డీడ్ ప్రక్రియ మాత్రం సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా పూర్తయ్యింది. ‘‘సీసీ కెమెరాలు పని చేయలేదు. బహుశా అప్పుడే కరెంటు పోయిందని వివరణ ఇస్తుండొచ్చునన్న’’ అనుమానాలు ఉన్నాయి.

ఇంతకీ ఈ లింక్ ఏమిటో?

అంతాయిపల్లి భూమిని సాదా బయనామాతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వృద్ధురాలికి కట్టబెట్టారు. అంతాయిపల్లికి, ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధం ఏమున్నది? ఈ భూమిపై హక్కులు ఎలా వచ్చాయో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన ఆధార్ కార్డులో చిరునామా ద్వారా సేల్ డీడ్ కూడా తయారైంది. దాన్ని వందల కి.మీ. దూరంలో ఉండే వృద్దురాలిని రంగంలోకి దింపినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయం అసలు పట్టాదారులకు తెలిసి అప్రమత్తమయ్యారు. తగిన డాక్యుమెంట్లతో సదరు భూమి తమదేనని అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే అంటే 19 రోజులలోనే అధికారులు సేల్ డీడ్లు రద్దు చేశారు. పాస్ పుస్తకాలు మాత్రం రద్దు కాలేదు. మరోవైపు ఆదిలాబాద్ కు చెందిన వృద్ధురాలు అంతాయిపల్లికి ఎలా వచ్చారన్న విషయంలో దర్యాప్తు చేయాల్సిందేనని పట్టాదారు భరతలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద లేవుట్ పక్కనే

మాగం దేవేందర్ రెడ్డి, భరతలక్ష్మి భూమికి పక్కనే పెద్ద వెంచర్ ఉన్నది. అది అధికార పార్టీతో సత్సంబంధాలు కలిగిన బడా కంపెనీ. అక్రమంగా లే అవుట్లు చేసి ప్లాట్లు విక్రయించారు. భవనాలు నిర్మించారు. కొనుగోలు చేసిన భూముల కంటే అధికంగా లేఅవుట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉండే పట్టాదారుల భూముల్లోకి చొరబడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను సర్వే చేయించుకునేందుకు లే అవుట్ యజమానులు సహకరించడం లేదని, పలుమార్లు బెదిరించారని దేవేందర్ రెడ్డి, భరతలక్ష్మి వాపోయారు. తమ భూమిని కూడా వెంచర్ లో కలుపుకొని ఫెన్సింగ్ వేసుకున్నారని, గేటు కూడా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వారసత్వంగా వచ్చిన భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. హెచ్ఎండీఏ కూడా వీళ్ల దరఖాస్తులను తిరస్కరించింది. తూంకుంట మున్సిపల్ కమిషనర్ కు ఆగస్టు 12న ఫిర్యాదు చేశారు. పట్టాదారులిద్దరూ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులే. ప్రస్తుతం అమెరికాలోని వారి పిల్లల దగ్గరికి వెళ్లారు. కోవిడ్-19 కారణంగా అక్కడే చిక్కారు. ఇండియా కు తిరిగి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని ఆసరాగా చేసుకొని రూ.100 కోట్ల విలువైన భూమిని కొట్టేయ్య డానికి ప్లాన్ చేశారు. దీని వెనుక ఓ మంత్రి అనుచరులు, బంధువులు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాలకు సంబంధించి మల్కాజిగిరి, మేడ్చల్ కోర్టుల్లో 20 వరకు కేసులు నడుస్తున్నాయి. మీడియాను కూడా మేనేజ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాధ్యులపై చర్యలేవి?

మాకు వారసత్వంగా వచ్చిన భూమి. అన్ని హక్కులు ఉన్నాయి. డాక్యుమెంట్లు ఉన్నాయి. సాదా బయనామాతో కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టిస్తే పాస్ పుస్తకాలు ఇస్తారు? మాగం కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు 1996లోనే సర్వే నం.103లోని వారి మొత్తం వాటా 15.24 ఎకరాలను అమ్మేశారు. ఈసీ తీసుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు చనిపోయిన తర్వాత 2019లో వారి వారసులు పట్టా పాసు పుస్తకాలు పొందుపరిచి అమ్మేస్తే తిరిగి భూ హక్కులను కల్పించారు. దాన్ని ఆసరాగా చేసుకొని బడా రియల్టర్లు మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. మా ఆస్తిని కొల్లగొట్టేందుకు యత్నిస్తోన్నవారిపై చర్యలు తీసుకోవాలి. దీని వెనుక పెద్దలు ఉన్నందునే పూర్తి చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాత్రపై విచారణ చేయాలి. – మాగం భారతలక్ష్మి, పట్టాదారు (అమెరికా నుంచి ఫోన్లో)

క్లారికల్ మిస్టేక్: రవి, ఆర్డీఓ, కీసర, మేడ్చల్ జిల్లా

అంతాయిపల్లిలో భారతలక్ష్మీ, దేవేందర్ రెడ్డి భూవివాదం కేవలం క్లారికల్ మిస్టేక్. దాన్ని సరి చేశారు. వాళ్ల పేరిట భూమి రికార్డుల్లో యథాతథంగా మార్చారు. ఎలా జరిగిందో నాకు తెలియదు.

Next Story