హైదరాబాద్ లో పెరుగుతున్న అక్రమకట్టడాలు.. చోద్యం చూస్తున్న అధికారులు.

by  |
houae
X

దిశ, సిటీ బ్యూరో: అక్రమ నిర్మాణాలకు సంబంధించి పాలకులు, సంబంధిత ఉన్నతాధికారులకు కోర్టులు అక్షింతలు వేసిన సంగతి తెల్సిందే! ఒక సారి ఆదేశాలు జారీ చేసిన తర్వాత అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా? లేదా? అన్ని విషయాన్ని కనీసం సమీక్షించకుండా గాలికొదిలేయటంతో అక్రమ నిర్మాణాలకు ఉన్నతాధికారులు పరోక్షంగా కారకులవుతుండగా , బల్దియాలోని టౌన్ ప్లానింగ్ లో క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే మున్షీ, టీపీఎస్ లు నేరుగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ డైరెక్టుగా కారకులవుతున్నారు. హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంలో జరిగే నిర్మాణాలు మాస్టర్ ప్లాన్ ప్రకారం భవిష్యత్ అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టు నిర్మాణాలు జరిగేలా చూడాల్సిన టౌన్ ప్లానింగ్ క్షేత్ర స్థాయి సిబ్బంది మనీ సంపాదించుకునే ప్లాన్ తో విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెండోరోజుల క్రితం సర్కిల్ 15లోని నల్లకుంటలో ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి బీజేపీ మహిళా కార్పొరేటర్ కుమారుడు చేసిన సెటిల్ మెంట్ భాగోతం వెనకా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. బేజీపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు అక్రమంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తుండగా, నిర్మాణ పనులను అడ్డుకోవల్సిన స్థానిక టౌన్ ప్లానింగ్ మున్షీ రాజయ్య ఆరు లక్షల లంచమడిగిన కార్పొరేటర్ తనయుడు, నిర్మాణ యజమాని మధ్య మధ్యవర్తిత్వం వహించినట్లు, అంతేగాక, ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి, ఆయన సహాయకుడిగా విధులు నిర్వర్తించే టౌన్ ప్లానింగ్ అధికారుల పేర్లను కూడా దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు.

అడిక్ మెట్ డివిజన్ లో ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి భవన యజమాని, కార్పొరేటర్ కుమారుడు, టౌన్ ప్లానింగ్ ప్రమేయాన్ని బట్టబయలు చేస్తూ వైరల్ అయిన ఆడియో, క్లిప్పింగ్ వ్యవహారంలో సదరు మున్షీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కేవలం సర్కిల్, జోనల్ అధికారులే గాక ప్రధాన కార్యాలయ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అక్రమ నిర్మాణం జరుపుతున్న యజమాని నుంచి భారీగా లంచం తీసుకున్న మున్షీ రాజయ్య అదనంగా డబ్బు దండుకునేందుకు, యజమానికి భయాందోళనకు గురి చేసి, సెటిల్ మెంట్ కు వచ్చేలా భయపట్టేందుకు ఉన్నతాధికారుల పేర్లను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు.

టౌన్ ప్లానింగ్ విభాగంలో క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే సిబ్ఫందిలో ఎక్కువ శాతం మంది వివిధ సర్కిళ్లలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అక్రమంగా కట్టుకోమని చెప్పేది వీరే, తీరా పనులు మొదలైన తర్వాత ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు అందిందని, వెంటనే పనులు నిలిపివేయాలని, అవసరమైతే ఓ నోటీసును కూడా జారీ చేసి యజమానికి భయాందోళనకు గురి చేసి క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. నిజంగానే పై స్థాయి అధికారులకు ఫిర్యాదుల అందింతే న్యాయపరమైన సలహాలిస్తూ, కోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకోవాలన్న విషయంపై కూడా యజమానులకు సహాయం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

Next Story

Most Viewed