ఆ అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటో..?

by  |
Karam-Industries1
X

దిశ, కోటగిరి: కరం ఇండస్ట్రీ, తొమ్మిది రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు విచారణ చేసి అవకతవకలు వాస్తమేనని, కరం ఇండస్ట్రీలో తూకం మోసం జరిగిందని జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. కానీ సూత్రదారి పాత్ర పోషించిన కరం ఇండస్ట్రీని సీజ్ చేసి వెళ్లిపోయారు. ఈ దోపిడీకి సూత్రదారులైన తొమ్మిది రైస్ మిల్లర్లుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. రైతులను రాజుగా చూడాలని ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టినా, స్పీకర్ పోచారం పలుమార్లు రైస్ మిల్లర్లు యజమానులు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినా, తొమ్మిది రైస్ మిల్లర్లు, కరం ఇండస్ట్రీతో చేతులు కలిపి సుమారు 20 లక్షల రూపాయల వరకు దోపిడీ చేసినా కూడా అధికారులలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడంపై ఆంతర్యం ఏమిటో…? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్యాడి పర్మిషన్ ఎలా ఇచ్చారు ?

కల్లూరు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న రైస్ మిల్లుకు, కోటగిరిలో శిథిలావస్థకు చేరిన రైస్ మిల్లుకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. పర్మిషన్ ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం ప్రతిపక్షాలు జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా అధికారులలో మాత్రం ఎలాంటి చలనం లేదు. అధికారుల మౌనం వెనుక రాజకీయ ఒత్తిళ్లా లేకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలియరావడం లేదు.


Next Story

Most Viewed