హామీ పత్రం ఉంటేనే స్కూల్‌లోకి ఎంట్రీ..!

by  |
school-holidays -1
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంస్థలను తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల నిర్వహణపై పలు నిబంధనలు విధించింది. విద్యార్థులు తరగతులకు హాజరుకావాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి పత్రాలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అంగీకార పత్రం లేకపోతే విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే క్లాసులకు హాజరుకాలేని విద్యార్థులపై ఎలాంటి చర్యలు చేసుకోవద్దని సూచించింది. కాగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించకుండా ప్రభుత్వం షరతులు విధించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

తరగతులపై నిబంధనలు

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. తరగతులకు హాజరుకావాలనుకున్న విద్యార్థులు తప్పనిసరిగా తమ తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలను సమర్పించాలని షరతులు విధించింది. అంగీకార పత్రం లేకుండా ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు పాఠశాలకు హాజరుకావాలని అధ్యాపకులు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్న విద్యార్థులను, వారి ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి పాఠశాలకు అనుమతించరాదని ఆదేశాలు ఇచ్చింది.

ఇదేం నిబంధనలు..?

ఆన్ లైన్ క్లాసులను నిర్వహించకుండా ప్రభుత్వం ఫిజికల్ తరగతుల నిర్వహణపై ఆంక్షలు విధించింది. పూర్తిగా ఆన్ లైన్ తరగతులను ఎత్తివేయడంతో పాఠశాలకు హాజరుకాలేని విద్యార్థులకు నష్టం వాటిళ్లనుంది. దీంతో కరోనాకు భయపడి ఫిజికల్ క్లాసులకు హాజరుకాలేని విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిజికల్ తరగతులతో పాటు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed