అడవులు ఆక్రమిస్తే సంక్షేమ పథకాలు కట్

by  |
అడవులు ఆక్రమిస్తే సంక్షేమ పథకాలు కట్
X

దిశ, నిజామాబాద్: అటవీ భూములు కబ్జా కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పోడు వ్యవసాయం పేరిట రిజర్వు ఫారెస్టులో అడుగు పెట్టి చెట్లను నరికే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం అటవీ శాఖ, ప్రభుత్వం హరితహారం పేరిట లక్షల మొక్కలను నాటుతున్నా అడవుల విస్తీర్ణం పెరగకపోగా అంతకంతకు ఆక్రమణకు గురవుతోంది. ప్రతి ఏటా వేసవి వచ్చే స రికి చెట్లు నరికివేస్తూ అటవీ హద్దులు మార్చివేస్తున్నా రు. వందల ఎకరాల అటవీ భూముల్ని పోడు వ్యవ సాయం పేరిట గిరిజనులు, గిరిజనేతరులు కబ్జా చేసి యథేచ్ఛగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేలా కబ్జా కోరులపై కేసుల నమోదుతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలకు ఉపక్రమించింది.

ఆక్రమణలపై పోలీసుల ఉక్కుపాదం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 853.21 కిలో మీటర్ల విస్తీర్ణం మేర అడవులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 19.30 శాతం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్ని, ఇందల్వాయి, కమ్మర్‌పల్లి, నిజామాబాద్ సౌత్, నార్త్, అటవీ రేంజ్ కార్యాలయాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 600 కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ మాచారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అటవీ రేంజ్ కార్యాయాలు ఉన్నాయి. ఆయా రేంజ్‌ల పరిధిలో బీట్ ఆఫీసర్‌లు, అస్టెంట్ బీట్ ఆఫీసర్‌లు, వాచర్‌లతో నిరంతరం నిఘా కొనసాగుతున్నా అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవటం సాధ్యం కావటం లేదు. వ్యవసాయం పేరుతో గిరిజనులు వందల ఎకరాల్లో భూములు ఆక్రమించుకుంటున్నారు. గత ఏడాది కాలంలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప బీట్ పరిధిలోని కాల్పొల్ తండా పరిధిలో 14 మంది గిరిజనులు అడవిని నరికి చదును చేశారు. వర్ని మండలం చందూర్ సెక్షన్ పరిధిలోని జలాల్‌పూర్ రిజర్వు ఫారెస్టులో 33 మంది లంబాడాలు అటవిని చదును చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో 17 మంది గిరిజనులు, గాందారీ రేంజ్ పరిధిలోని గండివేట్ ప్రాంతంలో 17 మంది అటవిని ధ్వంసం చేశారు. వీరందరిపై పోలీస్ కేసులతో పాటు క్రిమినల్ కేసులను నమోదు చేశారు.

కబ్జా చేస్తే సాయం ఉండదు..

అటవీ భూముల ఆక్రమణ క్రమక్రమంగా పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు హరితహారంలో మొక్కలు కూడా నాటనీయకపోవటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు పట్టాలు ఇచ్చారని చాలా మంది అటవీ భూముల్లో యథేచ్ఛగా వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులకు వెళ్లినా చాలా ఏండ్లుగా కాలయాపన జరుగుతుండటంతో నానాటికి భూమి హరించుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆటవి భూమిని కాపాడుకునేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలను బదిలీ చేసింది. ఆటవి భూమిని కబ్జా చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన సహయ సహకారాలను పూర్తిగా నిలిపివేసేలా రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జే. శోభ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో కబ్జాకు పాల్పడిన 81 మందిపై ప్రభుత్వ సాయం పొందకుండా వేటు వేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉత్తర్వులతోనైనా అటవీ భూముల ఆక్రమణ ఆగుతుందో లేదో వేచిచూడాల్సిందే..

Next Story