నల్లగొండలో ఐసీఎంఆర్ బృందం పర్యటన

by  |

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి ఐసీఎంఆర్ బృందం శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించింది. వైరస్ వ్యాప్తి నిర్ధారణ కోసం చేపట్టాల్సిన సర్వే, పరీక్షలపై జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి దేశవ్యాప్తంగా 82 జిల్లాలను కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో నల్లగొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఉదయ్ కుమార్, జగ్జీవన్‌బాబు తదితరుల బృందం నల్లగొండ జిల్లాకు చేరుకుంది. కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, జిల్లా సర్వేలైన్స్ అధికారి రాహుల్‌తో చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు సర్వే, పరీక్షలు ఎలా చేయాలి, ఏయే గ్రామాలను పరిగణనలోకి తీసుకోవాలనే విషయాలపై చర్చించి ప్రణాళికను సిద్ధం చేశారు.

జిల్లాకు ఐదు టీమ్‌లు

ఐసీఎంఆర్ బృందాలు ఐదు మళ్లీ జిల్లాకు రానున్నాయి. రెండ్రోజులపాటు జిల్లాలో పర్యటించి 400 మంది నుంచి నమూనాలు సేకరించి, ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచి 10 గ్రామాల చొప్పున ఎంపిక చేసి నమూనాలు సేకరిస్తారు. ఒక్కో బృందంలో ఐసీఎంఆర్ సభ్యులు ముగ్గురు చొప్పున ఉంటారు. ఆశా వర్కర్, ఏఎన్ఎం, వీఆర్ఓ, పోలీస్ సిబ్బంది ఆ బృందాలకు సహకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, జిల్లా సర్వే లైన్స్ అధికారి డాక్టర్ రాహుల్, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్‌లను కలెక్టర్ ఆదేశించారు.

Tags: Nalgonda, ICMR Teams, Tour, corona test, Rapid kits

Next Story

Most Viewed